New Delhi: యువతిని అడ్డు పెట్టుకుని సైబర్ నేరం... టార్గెట్ రూ. 500... బాధితుల సంఖ్య వేలల్లో!

  • న్యూఢిల్లీ కేంద్రంగా మోసం
  • నకిలీ డేటింగ్ యాప్ సృష్టించి దందా
  • యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కదిలిన డొంక

తన వలలో పడ్డ వారి నుంచి వసూలు చేసేది రూ. 500. మహా అయితే మరో రూ. 500. అంతే అతని టార్గెట్. అందుకోసం ఓ యువతి సహాయం తీసుకున్నాడు. ఓ నకిలీ డేటింగ్ యాప్ ను సృష్టించాడు. వేలాది మందిని టార్గెట్ చేసుకుని ఎంత కొల్లగొట్టి ఉంటాడో ఊహించుకోండి. తాము పోగొట్టుకున్నది చాలా చిన్న మొత్తాలే కావడంతో అతనిపై ఫిర్యాదులే రాలేదు. అయితే, తన ఫొటో ఓ డేటింగ్ యాప్ లో కనిపిస్తోందని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో తీగ లాగిన పోలీసులు డొంక కదిలేలా చేశారు.

న్యూఢిల్లీలో వెలుగుచూసిన ఈ సైబర్ నేరానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, చిరంజీవి (29) అనే యువకుడు, 19 ఏళ్ల యువతితో కలసి డేటింగ్ యాప్ తయారు చేశాడు. అమ్మాయిల చిత్రాలను సేకరించి, అందులో ప్రొఫైల్స్ పెడుతూ, అబ్బాయిలకు వలేసేవాడు. ఎవరైనా యువకులు స్పందిస్తే, అమ్మాయితో ఫోన్ చేయించి, డేటింగ్ కు వస్తానని చెప్పించి, ఈ వ్యాలెట్ లలో తక్కువ మొత్తాలను వేయించుకునేవాడు. ఆపై స్పందించేవాడు కాదు. పోగొట్టుకున్న మొత్తాలు తక్కువే కావడంతో ఎవరూ ఫిర్యాదులు చేయరన్న ఆలోచనతో ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడు కాదు. ఈ తతంగం పది నెలలుగా సాగుతోంది.

ఇక ఢిల్లీలోని అమర్ కాలనీలో ఉండే యువతికి చిరంజీవితో పరిచయం ఉంది. తన ఫొటోను అతను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టాడని తెలుసుకున్న ఆమె, పోలీసులను ఆశ్రయించగా, వారు విచారణ జరిపి, చిరంజీవిని, అతనికి సహకరిస్తున్న యువతిని అరెస్ట్ చేశారు.

More Telugu News