Bihar: మద్య నిషేధం తరువాత మారుతున్న బీహార్... ప్రజలు ఏం కొనుగోలు చేస్తున్నారంటే..!

  • మద్య నిషేధాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో బీహార్
  • మిగిలిన డబ్బుతో అభివృద్ధి పథంలో ప్రజలు
  • ఖరీదైన చీరలు, ఆస్తులు, ఆహారానికి ఖర్చు పెడుతున్న ప్రజలు
  • ఏడీఆర్ఐ, డీఎంఐ అధ్యయనంలో వెల్లడి

బీహార్ లో నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో మద్య నిషేధం ఒకటన్న సంగతి తెలిసిందే. మద్యం వ్యాపారులు, కొందరు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ, ప్రజా సంక్షేమం, వారి ఆరోగ్యమే తనకు ముఖ్యమంటూ నితీశ్ సాగిపోయారు. ఇక మద్య నిషేధం తరువాత బీహార్ ప్రజల్లో అత్యధికులు మందు కొట్టే అలవాటుకు దూరమయ్యారు. ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెడుతున్నారన్న విషయమై ఏడీఆర్ఐ (ఆసియన్ డెవలప్ మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) ఓ అధ్యయనం నిర్వహించి ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.

ఈ అధ్యయనం వివరాల ప్రకారం, బీహార్ లో ఖరీదైన చీరల కొనుగోళ్లు ఏకంగా 1,751 శాతం పెరిగాయి. తేనె వాడకం 380 శాతం, చీజ్ వాడకం 200 శాతం పెరిగాయి. 19 శాతం మంది ప్రజలు కొత్త ఆస్తులను కొనుగోలు చేశారు. ఏప్రిల్ 2016 నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులో ఉండగా, ఆపై ఏడాది పాటు మత్తుకు బానిసలైన వారు తీవ్ర ఇబ్బందులు, మానసిక రుగ్మతలతో బాధపడినా, ఆపై మారారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలు మద్యానికి దూరమైన తరువాత అభివృద్ధి దిశగా సాగుతున్నారు. మద్యానికి పెట్టే డబ్బును ఇతర మార్గాల్లో ఖర్చు చేస్తున్నారు. పాలు, మజ్జిగ, పెరుగు వంటి అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి.

ఏడీఆర్ఐ వివరాల ప్రకారం, మజ్జిగ అమ్మకాలు 40 శాతం, ఫ్లేవర్డ్ మిల్క్ అమ్మకాలు 28.4 శాతం, లస్సీ అమ్మకాలు 19.7 శాతం పెరుగగా, ఖరీదైన డ్రస్ మెటీరియల్స్ అమ్మకాలు 910 శాతం, ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మకాలు 46 శాతం, ఫర్నీచర్ అమ్మకాలు 20 శాతం, ఆట వస్తువుల అమ్మకాలు 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఈ మార్పు రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పష్టమైన మార్పు చూపుతోందని ప్రభుత్వ రంగ డెవలప్ మెంట్ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ (డీఎంఐ) వ్యాఖ్యానించింది. ఏడీఆర్ఐతో పాటు అధ్యయనంలో పాల్గొన్న డీఎంఐ టీమ్, నెవాడ, పూర్ణియా, సమస్థిపూర్, పశ్చిమ చంపారన్, కైమూర్ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. మద్య నిషేధానికి ముందు ప్రతి ఇంట్లో కుటుంబ పోషణ ఖర్చు సగటున రూ. 1,005 ఉండగా, ఇప్పుడది రూ. 1,331కి పెరిగింది.

ఇక మద్య నిషేధం తరువాత గ్రామాల్లో తమకు గౌరవం పెరిగిందని 58 శాతం మంది మహిళలు వ్యాఖ్యానించారు. నేరాలకు ఆలవాలమైన రాష్ట్రంలో ఇప్పుడు కిడ్నాపుల సంఖ్య 66.6 శాతం తగ్గగా, హత్య కేసులు 28.3 శాతం, దోపిడీలు 2.3 శాతం తగ్గాయి. మొత్తం మీద ప్రతి కుటుంబం నెలకు సగటున రూ. 440 ఆదా చేస్తోందని, రాష్ట్రం మొత్తం మీద సంవత్సరంలో రూ. 5,280 కోట్లు ఆదా అవుతున్నాయని వెల్లడించింది. ఇదంతా ఒక ఎత్తయితే, రాష్ట్రంలో ఇప్పటికీ మందు బాబుల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఉంది. వారంలో కనీసం రూ. 1000 ఖర్చు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని కొనుగోలు చేస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయని అధ్యయనం పేర్కొనడం కొసమెరుపు.

More Telugu News