USA: ప్రతి హీరోయిన్ ఎక్కడికి వెళుతుందో తెలుసుకోలేము కదా?: శివాజీ రాజా

  • వీసా నిబంధనలను అవగతం చేసుకోవాలి 
  • అంతా సురక్షితమని భావిస్తేనే విదేశాలకు వెళ్లాలి
  • అమెరికా సెక్స్ రాకెట్ పై 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా

అమెరికాకు వెళ్లే ప్రతి హీరోయిన్ ఎక్కడికి వెళుతుందో, ఏమి చేస్తుందో తెలుసుకునే పరిస్థితి ఉండదని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' అధ్యక్షుడు శివాజీరాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ ను కుదిపేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ పై స్పందించిన ఆయన, ఏవైనా అసోసియేషన్ లు తాము జరిపే కార్యక్రమాలకు ఆహ్వానించినప్పుడు, వాటి చరిత్ర గురించి నటీమణులు తెలుసుకునే ప్రయత్నం చేయాలని, తగు జాగ్రత్తలు తీసుకునే అక్కడికి వెళ్లాలని ఆయన సూచించారు.

వీసా నిబంధనలు పూర్తిగా అవగతం చేసుకున్న తరువాత, తాము సురక్షితంగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకావని అనుకున్నప్పుడే వెళ్లాలని సలహా ఇచ్చారు. ఎవరికైనా ఆహ్వానాలు అందితే, ఆ వివరాలు తమకు తెలపాలని, సదరు ఈవెంట్ నిర్వాహకుల గత చరిత్రను పరిశీలించి సలహాలు ఇస్తామని తెలిపారు. అమెరికా సెక్స్ రాకెట్ పై చర్చించేందుకు 24న ప్రత్యేకంగా సమావేశం కానున్నామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ తరఫున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, విదేశాలకు హీరోయిన్లు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా 'మా'కు తెలియజేయాలన్న నిబంధనను టాలీవుడ్ పెద్దలు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News