Guntur: వజ్రాలను తెచ్చే తొలకరి వర్షం.. గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతానికి తరలివస్తున్న వందల కుటుంబాలు!

  • సందడిగా మారిన గుంటూరు జిల్లా అటవీ ప్రాంతం
  • వర్షం కోసం ఎదురుచూస్తూ కూర్చునే వేలాది మంది
  • రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల విలువైన వజ్రాలు లభిస్తాయని ప్రచారం

వర్షాకాలం వచ్చిందంటే అక్కడ సందడే సందడి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అంతా సిద్ధమైపోతుంటారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కేతవరం, పులిచింతల, చిట్యాలతండా, కొళ్లూరు తదితర గ్రామాల్లో తొలకరి పలకరింపుతో ఈ సందడి వాతావరణం కనిపిస్తుంది. దానికి కారణం, వర్షాలు పడితే.. భూమిలో వున్న వజ్రాలు బయటకొస్తాయని ఇక్కడి ప్రజలు భావిస్తారు.

కళ్లు చెదిరే మెరుపుతో కనిపించే ఏ రాయి దొరికినా రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోవచ్చన్న అంచనాతో వందలాది మంది బెల్లంకొండ ప్రాంతానికి తరలివచ్చి వర్షం కురిసే సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇక్కడి పొలాలు, అటవీ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే వజ్రాల కోసం వెతుకుతూ కనిపించేవాళ్లు ఎంతో మంది కనిపిస్తుంటారు. కోహినూర్ వజ్రం కూడా ఈ ప్రాంతంలో లభించినదే.

తమతమ పొలాలను దున్నుతున్నప్పుడు పలువురు రైతులకు వజ్రాలు దొరికిన సందర్భాలున్నాయి. అలా కొన్ని సందర్భాల్లో లక్షల విలవ చేసే రంగురాళ్లు, కొన్నిసార్లు అంతకన్నా మరింత విలువైన వజ్రాలు ఇక్కడ లభించాయి. సుమారు రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ విలువైన వజ్రాలు ఇక్కడ లభిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. దొరికిన రంగు రాయి, వజ్రం నాణ్యత, రూపం, బరువును బట్టి విలువను నిర్ణయిస్తుంటారని ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ దొరికే వజ్రాలను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి వ్యాపారులు కూడా వచ్చి ఇక్కడ మకాం వేస్తుంటారు.

ఇక వజ్రాలు వేటాడేందుకు ఇక్కడికి వచ్చే వారు మూడు నెలల పాటు ఇక్కడే మకాం వేస్తారు. హైదరాబాద్, విజయవాడ, పొన్నూరు, రేపల్లె, తెనాలి తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారితో ఇక్కడి గ్రామాలన్నీ కిక్కిరిసిపోతాయి. వర్షం కురిస్తే చాలు. ప్రతి ఒక్కరూ పొలాల్లోకి, అడవుల్లోకి వెళ్లిపోతారు. తాజాగా వెంకటాయపాలెంలో ఓ వ్యక్తి తన పొలం దున్నుతుండగా, వజ్రం దొరికిందని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యాపారి వద్దకు తీసుకెళితే, అది విలువైనదని చెప్పి రూ. 10 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే వజ్రాన్ని ఆ వ్యాపారి రూ. 98 లక్షలకు అమ్ముకున్నట్టు ఇక్కడ ప్రచారం జరుగుతోంది.  

  • Loading...

More Telugu News