Hyderabad: కొట్టుకున్న ఏపీ ఎన్జీవోలు.. భాగ్యనగర్ టీఎన్జీవోలు!

  • అబిడ్స్ కార్యాలయంలో ఏపీ, టీఎన్జీవో ఉద్యోగుల మధ్య ఘర్షణ
  • స్థలాల కేటాయింపు, డబ్బులపై నిలదీత
  • పరస్పరం పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్ అబిడ్స్‌లోని ఏపీ ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఏపీ ఎన్జీవోలు, భాగ్యనగర్ టీఎన్జీవోల మధ్య ఘర్షణ జరిగి రెండు వర్గాలు పరస్పరం నెట్టుకున్నాయి. అప్పటి ప్రభుత్వం గచ్చిబౌలిలో ఉద్యోగులకు కేటాయించిన స్థలం విషయంలో నెలకొన్న వివాదమే ఇందుకు కారణం. పరుచూరి అశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఏపీ ఎన్జీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థలాల కేటాయింపు, డబ్బుల విషయమై మాట్లాడుకునేందుకు రావాలంటూ ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పలువురు సభ్యులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు అశోక్ బాబు, చంద్రశేఖర్ రెడ్డిలను చుట్టుముట్టి ఘర్షణకు దిగారు.  

ఏళ్లు గడుస్తున్నా స్థలాల కేటాయింపు, డబ్బుల విషయం గురించి మాట్లాడడం లేదని, కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. సొసైటీ జనరల్ బాడీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ రెడ్డి , అశోక్ బాబులకు స్వల్పంగా గాయాలయ్యాయి. కార్యాలయంలోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

గచ్చిబౌలిలో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను రెండు ప్రాంతాల ఉద్యోగులు సమానంగా పంచుకుందామని అశోక్ బాబు అన్నారు. సొసైటీ డబ్బులు ప్రభుత్వ అధీనంలో ఉన్నాయని, వాటిని ఎవరూ వాడుకోలేదని తెలిపారు. కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందామని సూచించారు. అయితే, అశోక్ బాబు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సొసైటీని వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News