Marriages: తిరిగి మొదలైన ముహూర్తాలు... ఒకటి కానున్న వేలాది జంటలు!

  • రేపటి నుంచి శుభ ముహూర్తాలు
  • జూలై 7 వరకూ మంచి రోజులు
  • ఆపై ఆగస్టు 15 వరకూ ఆషాడ మాసం
తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాల సందడి నెలకొంది. అధిక మాసం ముగిసి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడం, మరో 20 రోజుల పాటు శుభముహూర్తాలు ఉండటంతో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. రేపటి నుంచి శుభ ముహూర్తాలు ఉండగా, 22, 23, 24, 27, 28, 29, 30, జూలై 1, 2, 3, 5, 6, 7 తేదీల్లో వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఆపై జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకూ ముహూర్తాలుండవని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ సీజన్ ముహూర్తాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫంక్షన్ హాల్స్ ఇప్పటికే బుక్ కాగా, గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న పురోహితులకు, నాదస్వర బృందాలకు డిమాండ్ పెరిగింది. వచ్చే 20 రోజుల్లో 14 ముహూర్తాలు ఉండటంతో కొత్త ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, పెళ్లి చేసుకునేందుకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు వేలాది మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలు పెట్టుకున్న వారు ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తుండటంతో బడా మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకూ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. కల్యాణ మండపాల అద్దెలను ఒక్కసారిగా పెంచేశారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
Marriages
Telangana
Andhra Pradesh
Function Halls
Muhurthas

More Telugu News