Donald Trump: ఉత్తర కొరియా సైనికాధికారికి ట్రంప్ సెల్యూట్... ఆలస్యంగా బయటకు వచ్చిన ఫొటో, వీడియో!

  • నో క్వాంగ్ చోల్ కు సెల్యూట్ చేసిన ట్రంప్
  • కేసీటీవీలో కిమ్, ట్రంప్ చర్చలపై డాక్యుమెంటరీ
  • డాక్యుమెంటరీలో ఎవరూ ఊహించని దృశ్యాలు

ప్రపంచ దేశాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య సమావేశం ఈ వారం మొదట్లో సింగపూర్ లో విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి భేటీ అనంతరం ఉత్తర కొరియా సైనిక అధికారికి ట్రంప్ సెల్యూట్ చేశారు. అందుకు సంబంధించిన చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సమావేశంపై ఉత్తర కొరియా అధికారిక టెలివిజన్ 42 నిమిషాల డాక్యుమెంటరీని తాజాగా ప్రసారం చేయగా, అందులో ఈ దృశ్యం కనిపించింది.

 కేసీటీవీ ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ కిమ్ పైనే అధికంగా ఫోకస్ పెట్టి తీశారు. ఆయన పాంగ్ యాంగ్ లో ఎయిర్ చైనా విమానం ఎక్కినప్పటి నుంచి సింగపూర్ కు వెళ్లడం, అక్కడి విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్వాగతం చెప్పడం, వేలాది మందికి అభివాదం చేస్తూ, కిమ్ కాన్వాయ్ లో వెళుతుండటం, ఆపై ట్రంప్ తో సమావేశం తదితర విశేషాలున్నాయి. సింగపూర్ లోని ఫైవ్ స్టార్ హోటల్ సెయింట్ రీగిస్ లో కిమ్ బసచేసిన లగ్జరీ సూట్ లోని సౌకర్యాలు కూడా చూపించారు. సింగపూర్ ప్రధాని లీ హిసిన్ లూంగ్ నూ కాసేపు చూపారు. డాక్యుమెంటరీ తొలి సగంలో ట్రంప్ ఎక్కడా కనిపించక పోగా, ఆపై ఆయన్ను కాసేపు చూపించారు.

ఈ వీడియోలో 23వ నిమిషంలో ఎవరూ ఊహించని ఘటన ఉంది. దీన్ని అమెరికాతో పాటు వీరి భేటీని చూసిన ఎవరూ చూడలేదు. ఉత్తర కొరియా సైనిక అధికారి నో క్వాంగ్ చోల్ వద్దకు ట్రంప్ వచ్చిన వేళ, తొలుత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించగా, ఎదురుగా ఉన్న అధికారి సెల్యూట్ చేసి షేక్ హ్యాండ్ ఇవ్వబోయారు. ఈలోగా ట్రంప్ తన చేతిని వెనక్కు తీసుకుని, ఆయనకు సెల్యూట్ చేశారు. ప్రతిగా క్వాంగ్ చోల్ సైతం సెల్యూట్ చేయగా, కిమ్ నవ్వుతూ పక్కనుండి చూస్తున్నారు. ఆ డాక్యుమెంటరీ వీడియోను, ట్రంప్ సెల్యూట్ ను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News