Aurangzeb: ఉగ్రవాదులు అపహరించిన సైనికుడు ఔరంగజేబ్ శవమై తేలాడు!

  • జవాన్ ఔరంగజేబ్ ను కిడ్నాప్ చేసిన తీవ్రవాదులు
  • అత్యంత పాశవికంగా కాల్చి చంపిన వైనం
  • ఐఎస్ఐ హస్తం ఉందన్న ఇంటెలిజెన్స్

జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఔరంగజేబ్ అనే సైనికుడిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. రంజాన్ పండుగను జరుపుకునేందుకు అతను ఇంటికి వెళ్తుండగా తీవ్రవాదులు అపహరించారు. ఆ తర్వాత కాసేపటికే అతను ఒంటినిండా బుల్లెట్లతో శవమై కనిపించాడు. అత్యంత పాశవికంగా అతని తల, మెడలోకి ముష్కరులు బుల్లెట్లను దింపారు. ఈ దారుణం వెనుక పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ హస్తం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. భారత సైన్యానికి హెచ్చరికలు జారీ చేసేందుకే ఇంతటి దుర్మార్గానికి పాల్పడిందని ఇంటెలిజెన్స్ విభాగం అనుమానిస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు తాము బెదరబోమనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనబడుతోందని తెలిపింది.

హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సమీర్ టైగర్ ఎన్ కౌంటర్ లో ఔరంగజేబ్ కూడా పాల్గొన్నాడు. అతను పూంఛ్ జిల్లా వాసి. విధులు ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా అతన్ని చుట్టుముట్టిన తీవ్రవాదులు... తుపాకులతో బెదిరించి, తమతో పాటు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే జమ్ముకశ్మీర్ పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు తుపాకీ కాల్పులతో జల్లెడలా మారిన అతని మృత దేహం గుస్సు గ్రామంలో లభించింది. ఈ ఘటనతో భారత సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

మరోవైపు, ఈ దారుణంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. భయంకరమైన వార్తను ఈ రోజు వినాల్సి వచ్చిందని... ఔరంగజేబ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. 

More Telugu News