Water Crises: ముందుంది నీటి కష్టం... కోట్లాది మంది ప్రాణాలు ప్రమాదంలో: కలకలం రేపుతున్న నీతి ఆయోగ్ నివేదిక

  • 2030 నాటికి తీవ్ర నీటికి కటకట 
  • అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి
  • జార్ఖండ్, హర్యానా, యూపీ, బీహార్ లలో దయనీయ పరిస్థితులు
  • నీతి ఆయోగ్ 'సీడబ్ల్యూఎంఐ' రిపోర్టు

భారత చరిత్రలో ఎన్నడూ లేనంత నీటి కొరత సమీప భవిష్యత్తులో రానుందని కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. 2030 నాటికి నీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తాయని అంచనా వేసిన నీతి ఆయోగ్, దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి రానుందని ఓ నివేదికలో తెలిపింది. ఈ నీటి కొరత దేశ జీడీపీపై ఆరు శాతం వరకూ ప్రభావాన్ని చూపనుందని అంచనా వేసింది.

ఇండియాలో సురక్షిత మంచి నీరు లభించక ప్రతి ఏటా రెండు కోట్ల మంది మరణిస్తున్నారని, 60 కోట్ల మందికి తగినంత మంచి నీరు లభించడం లేదని కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ) పేరిట విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది. దేశంలోని రాష్ట్రాలు నీటి నిర్వహణ విషయంలో విఫలమవుతున్న కారణంగానే కష్టాలు పెరుగుతున్నాయని వెల్లడించింది.

నీటి నిర్వహణ విషయంలో గుజరాత్ ముందుందని, ఆపై మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని కితాబిస్తూ, జార్ఖండ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొంది. హిమాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, త్రిపురలో నీటి లభ్యత బాగుందని, ఆపై హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం రాష్ట్రాలున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది.

2015-16 పరిస్థితులతో పోలిస్తే, రాజస్థాన్ లో నీటి వనరుల పెంపు గణనీయంగా మెరుగుపడిందని తెలిపింది. నీటి కొరతకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు కూడా కారణం అవుతున్నాయని, ముఖ్యమైన ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని సూచించింది.

More Telugu News