Chandrababu: చంద్రబాబును రాజకీయాల్లో నుంచి బయటకు పంపాలి!: మోత్కుపల్లి

  • ఎన్టీఆర్ గారి జెండా పట్టుకుని చావాలనేది నా ఉద్దేశం
  • దానికి నన్ను చంద్రబాబు దూరం చేశాడు
  • చంద్రబాబును రాజకీయాల్లో నుంచి బయటకు పంపాలి 

బ్రోతల్ హౌస్ కన్నా అన్యాయంగా టీడీపీని చంద్రబాబు నడిపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని మోత్కుపల్లి నివాసానికి  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు.

 అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, ‘దళితుల మధ్య, బీసీల మధ్య, బ్రాహ్మణుల మధ్య చంద్రబాబునాయుడు చిచ్చుపెట్టాడు. ఈరోజు తన స్వార్థం కోసం ప్రజలందరినీ కూడా బలి చేస్తున్న చీడ పురుగు చంద్రబాబు. దళితులంటే ఆయనకు లెక్కలేదు. మోత్కుపల్లిని తీసి పారేస్తే పోయేవాడు కాదు. నేను ఏ తప్పూ చేయకపోయినా.. ఎన్టీ రామారావు గారి జెండాను నాకు దూరం చేశారు. పార్టీ నుంచి నన్ను బహిష్కరించడమేనేది భరించలేని బాధ. ఎవరు పార్టీలు మారినా నేను పార్టీ మారను.

ఎన్టీఆర్ గారి జెండా పట్టుకుని చావాలనేది నా ఉద్దేశం. దానికి నన్ను చంద్రబాబు దూరం చేశాడు. అదే నా బాధ. చంద్రబాబును రాజకీయాల్లో నుంచి బయటకు పంపాలి.. గోరీ కట్టాలని తెలంగాణ క్యాడర్ కు, ఆంధ్రా ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీలో చంద్రబాబునాయుడు కంటే కూడా నేను సీనియర్ నాయకుడిని. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్ అనుచరులందరూ చచ్చిపోయారు. చంద్రబాబు వల్లే మానసికంగా ఇబ్బంది పడి చనిపోయారు. చివరకు, గాలి ముద్దు కృష్ణమ నాయుడిని కూడా చంద్రబాబు ఏ రకంగా అగౌరవ పరిచారో నేను చెప్పక్కర్లేదు.

గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఒక తమ్ముడిగా తన బాధను చాలాసార్లు నాతో పంచుకున్నాడు. చివరకు మిగిలింది.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నేను. నాకు షుగర్, బీపీ, అనేక రోగాలు ఈ దుర్మార్గుని వల్లే వచ్చాయి. నా చావుకు ఈయనే కారణమయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా నేను భయపడేది లేదు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్టీ రామారావు గారి చివరి శిష్యుడిగా, ఆయన కోసం, ఆయన సిద్ధాంతాల కోసమే బతకాలని నిర్ణయించుకున్న నేను చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News