Russia: విదేశీయులకు దూరంగా వుండండి.. లేకుంటే ఇబ్బందులే!: రష్యా అమ్మాయిలకు ప్రభుత్వ సలహా

  • నేటి నుంచి రష్యాలో ఫుట్ బాల్ పోటీలు
  • విదేశీయులతో శృంగారం వద్దని సలహా
  • ఒంటరి తల్లిగా నిలిచిపోవద్దని సూచించిన తమరా ప్లెట్‌ న్యోవా

నేటి నుంచి రష్యాలోని వివిధ నగరాల్లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోటీలు జరగనున్న నేపథ్యంలో, తమ దేశ అమ్మాయిలకు రష్యా ప్రభుత్వం ఓ సలహా ఇచ్చింది. విదేశీయులతో ఎట్టి పరిస్థితుల్లో శృంగారాన్ని జరపవద్దని, వారితో లైంగిక సంబంధాలతో మిశ్రమ జాతి పిల్లలను కని, సింగిల్ మదర్ గా మిగిలిపోవద్దని చట్టసభ సీనియర్ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్‌ తమరా ప్లెట్‌ న్యోవా సూచించారు. రష్యా అమ్మాయిలు ఎంతో మంది విదేశీయులను వివాహం చేసుకుని, దారుణంగా మోసపోయారని, విదేశాల్లో చిక్కుకుపోవడం, వారి పిల్లలు ఒంటరిగా మిగలడం లేకుంటే మహిళలు స్వదేశంలో ఒంటరిగా ఉండి పోవడం వంటి ఘటనలు కోకొల్లలని తెలిపారు.

కాగా, 1980లో మాస్కో ఒలింపిక్స్ జరిగిన వేళ, విదేశీయులతో గడిపిన ఎంతో మంది రష్యా మహిళలు సరైన గర్భనిరోధక పద్ధతులు పాటించక ఎంతో మంది బిడ్డలను కనగా, వారంతా 'ఒలింపిక్ పిల్లలు'గా ముద్రపడి పోయారు. రష్యా మహిళలకు, శ్వేతజాతియేతరులకు పుట్టిన పిల్లలపై రష్యాలో తీవ్ర వివక్ష ఉంది. ఈ పరిస్థితులను గుర్తు చేసిన తమరా, మన పిల్లలకు మాత్రమే మనం జన్మనివ్వాలని, భవిష్యత్తులో మిశ్రమ జాతి చిన్నారులు వద్దే వద్దని ఓ రేడియో కార్యక్రమంలో ప్రసంగిస్తూ సూచనలు చేశారు.

More Telugu News