Tollywood: టాలీవుడ్ హీరోయిన్లను కాల్ గాళ్స్‌గా పేర్కొంటూ ప్రకటన.. మాజీ ప్రిన్సిపాల్ నిర్వాకం!

  • ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్‌లో టాలీవుడ్ మహిళా నటుల ఫొటోలు
  • డబ్బులు పడ్డాక ఫోన్ స్విచ్ఛాప్
  • మోసపోయిన పలువురు యువకులు
  • వ్యాపారంలో నష్టం వచ్చినందుకేనన్న నిందితుడు

టాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ హీరోయిన్ల ఫొటోలను వాడుకుని అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్న మాజీ ప్రిన్సిపాల్ బండారం బయటపడింది. హీరోయిన్లను కాల్‌ గాళ్స్‌గా ట్యాగ్ చేస్తూ ఆన్‌లైన్ క్లాసిఫైడ్ నెట్‌వర్క్‌లో ప్రకటన ఇచ్చాడు. అలాగే, ధరలు కూడా ముందే నిర్ణయించాడు. రూ.40 వేల నుంచి రూ. 60 వేల ధర నిర్ణయించిన ప్రిన్సిపాల్ తన మొబైల్ నంబరు కూడా ఇచ్చాడు.

ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ఫ్లాట్‌ఫామ్ ‘లోకెంటో’లో హీరోయిన్ల ఫొటోలు కనిపించడంతో కొందరు మేడిపల్లికి చెందిన నిందితుడు సీహెచ్ గణేశ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే, తొలుత డబ్బులు తన ఖాతాలో జమ చేయాల్సిందిగా కోరుతూ తన బ్యాంకు ఖాతా నంబరు ఇచ్చాడు. డబ్బులు తన ఖాతాలోకి వచ్చిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేసేవాడు. అతడి వలలో పలువురు చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తంగా రూ.1.8 లక్షలు ఇలా తన ఖాతాలో వేయించుకున్నట్టు తెలిపారు.  

తన ఫొటో క్లాసిపైడ్స్‌లో కనిపించడంతో పాప్యులర్ కేరక్టర్ ఆర్టిస్ట్ ఒకరు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అతడు ప్రిన్సిపాల్‌గా పనిచేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. వ్యాపారంలో దెబ్బతినడంతో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే ఇలా చేస్తున్నట్టు నిందితుడు తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News