Chandrababu: హస్తిన బాట పట్టిన తెలుగు చంద్రులు!

  • ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు, కేసీఆర్
  • నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
  • కేంద్రాన్ని నిలదీయనున్న చంద్రబాబు
  • రేపు ప్రధానితో కేసీఆర్ భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే చంద్రశేఖరరావు, నారా చంద్రబాబునాయుడు హస్తిన బాట పట్టనున్నారు. ఢిల్లీలో 17వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేసీఆర్, చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. తొలుత 16వ తేదీన నీతి ఆయోగ్ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ రోజున రంజాన్ పర్వదినం రానుండటంతో, వాయిదా వేయాలని పలు రాష్ట్రాల సీఎంలు కోరినందున సమావేశాన్ని ఒక రోజు పోస్ట్ పోన్ చేశారు.

 దేశాభివృద్ధిపై తదుపరి ఎజెండా ఏంటన్న విషయమై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఈ సమావేశంలో నిలదీయడం ద్వారా బీజేపీని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కాలేదన్న సంగతి తెలిసిందే.

ఇక నేడు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లే కేసీఆర్, రెండు రోజుల పాటు బిజీగా గడపనున్నారు. తన మలి న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింట్ మెంట్ ను పొందలేక పోయిన కేసీఆర్, ఈ దఫా ఆయన్ను కలవనున్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీల భేటీ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనుంది. మోదీతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల పురోగతి, ఇటీవల ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమాల గురించి కేసీఆర్, ప్రధానికి వివరిస్తారని సమాచారం. నీతి ఆయోగ్ సమావేశం జరిగేంత వరకూ కేసీఆర్ న్యూఢిల్లీలోనే ఉంటారా లేక హైదరాబాద్ కు తిరిగి వచ్చి, మరోసారి వెళతారా? అన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. 

More Telugu News