Naga vaishnavi: విజయవాడ చిన్నారి నాగవైష్ణవి కేసులో నేడే తుది తీర్పు.. సర్వత్ర టెన్షన్!

  • 2010లో నాగవైష్ణవి హత్య
  • కుమార్తె మరణం తర్వాత కలతతో తండ్రి మృతి
  • పూర్తయిన విచారణ.. తీర్పు కోసం ఎదురుచూపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో నేడు తుది తీర్పు రానుంది. ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడుతుండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడలో 2010లో జరిగిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటరామమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ అనే కుమారుడు జన్మించిన తర్వాత, నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదను ప్రభాకర్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సాయితేజేష్, నాగవైష్ణవి ఇద్దరు సంతానం కలిగారు.

వైష్ణవి పుట్టిన తర్వాత ప్రభాకర్ దశ తిరిగింది. కుమార్తె పేరుతో ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య వెంకటరామమ్మ సోదరుడు వెంకటరావు బలంగా నమ్మాడు. దీంతో వైష్ణవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

అనుకున్నదే తడవుగా చిన్నమ్మ కుమారుడు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 30న వైష్ణవిని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఇనుమును కరిగించే బాయిలర్‌లో వేసి బూడిద చేశారు. వైష్ణవి మరణవార్తతో కలత చెందిన ప్రభాకర్ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. కేసు విచారణ పూర్తి కావడంతో నేడు కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ అప్పటి నుంచీ రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేయడం విశేషం.
Naga vaishnavi
Vijayawada
Murder
Andhra Pradesh

More Telugu News