mla vijaydharani: మహిళా ఎమ్మెల్యేను మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోమన్న తమిళనాడు అసెంబ్లీ స్పీకర్!

  • తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి ఆరోపణలు
  • స్పీకర్ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారు?
  • అసెంబ్లీలోనే మహిళల పరిస్థితి ఇలా ఉంటే, రోడ్లపై ఎలా ఉంటుంది?

తమిళనాడు స్పీకర్ పి.ధన్ పాల్ పై ఓ మహిళా ఎమ్మెల్యే సంచలన ఆరోపణలకు దిగారు. కాంగ్రెస్ కు చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి తన జిల్లాలో షార్ట్ సర్క్యూట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం అంశాన్ని సభలో ప్రశ్నించే ప్రయత్నం చేయగా, స్పీకర్ తిరస్కరించడంతోపాటు, మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని సూచించినట్టు ఆరోపించారు.

 ‘‘స్పీకర్ సభాముఖంగానే మంత్రితో వ్యక్తిగతంగా బయట డీల్ చేసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో సభను భాగస్వామ్యం చేయలేదు. స్పీకర్ అసెంబ్లీలో ఈ విధంగా ఎలా మాట్లాడతారు? నాకు కన్నీళ్లు వచ్చాయి. జీరో అవర్ లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వనని చెప్పారు’’ అంటూ ఎమ్మెల్యే ధరణి మీడియా ముందు వాపోయారు.

మహిళలకు అసెంబ్లీలోనే ఈ తరహా అనుభవం ఎదురైతే, ఇక రోడ్లపై వారి పరిస్థితి ఎలా ఉంటుందోనన్నారు. అయితే, స్పీకర్ ధన్ పాల్ మాత్రం సదరు ఎమ్మెల్యే భయపెట్టే రీతిలో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. స్పీకర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేశారు.

More Telugu News