Anam Ramanarayan Reddy: టీడీపీకి ఆనం టాటా?.. గుర్తింపు లేని చోట ఉండలేనని వ్యాఖ్య!

  • పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆవేదన
  • సన్నిహితులు, ఆత్మీయులతో చర్చించి తదుపరి నిర్ణయం
  • టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలిసిన ఆనం
తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై టీడీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ‘మీరు పార్టీ మారబోతున్నారట కదా?’ అన్న విలేకరుల  ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. గౌరవం లేని చోట తాను ఉండలేనని తేల్చి చెప్పారు. తాను గతంలో ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థంగా పనిచేశానని పేర్కొన్నారు. గుర్తింపు, గౌరవం లేని చోట తాను ఉండలేనని పేర్కొన్నారు. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ కుటుంబానికి సన్నిహితులు, అనుచరులు, అభిమానులు ఉన్నారన్న ఆనం.. వారందరితో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. సూళ్లూరుపేటలోనూ తనకు సన్నిహితులు ఉన్నారని, వారితో కూడా మాట్లాడిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకుంటానన్నారు. కాగా, మంగళవారం ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో పలువురు టీడీపీ, కాంగ్రెస్ నేతలను కలవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
Anam Ramanarayan Reddy
Telugudesam
Andhra Pradesh

More Telugu News