Andhra Pradesh: ఎమ్మార్పీలను నియంత్రించే చట్టాన్ని కేంద్రం తీసుకు రావాలి: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

  • లీటర్ వాటర్ బాటిల్ రూ.100 కు విక్రయం
  • చట్టంలో లొసుగులతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు
  • డిసెంబర్ లో వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు అవార్డులు

ఎమ్మార్పీలను నియంత్రించే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆరేళ్ల తరవాత తొలిసారిగా తన హయాంలో వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగినట్లు చెప్పారు. ఈ సమావేశంలో 13 జిల్లాలకు చెందిన సభ్యులతో పది శాఖల అధికారులు పాల్గొన్నారని అన్నారు. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నారని, ఇటీవల పీవీపీ షాపింగ్ మాల్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా, బ్రాండెడ్ కాకుండా స్థానికంగా తయారైన వాటర్ బాటిల్ ను రూ.100కు విక్రయించడం గుర్తించామని. చట్టంలో ఉన్న లొసుగులను తమకనుకూలంగా కొందరు వ్యాపారులు వినియోగించకుంటున్నారని అన్నారు.

ఎమ్మార్పీపై తమ కంట్రోల్ లేదని, దీనివల్ల వినియోగదారులు మోసపోయే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు దాడులు చేయడం ద్వారా ఎమ్మార్పీ కంటే అధిక ధరల విక్రయాలను అడ్డుకుంటున్నామని, ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల  జాయింట్ కలెక్టర్లను ఆదేశించామని పుల్లారావు చెప్పారు.

కొందరు వ్యాపారులు ఎమ్మార్పీతో పాటు జీఎస్టీని కూడా వేస్తున్నారని, ఎమ్మార్పీలోనే జీఎస్టీ ఉంటుందని, అదనంగా ఏమీ చెల్లించనక్కర్లేదని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. నర్సరీలలో నకిలీ మొక్కలు అమ్ముతున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని, నర్సరీలను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే సమావేశం నాటికి ఆయా శాఖలు తమకొచ్చిన ఫిర్యాదులపై పరిష్కారాలు చూపి, ఒక నివేదిక రూపొందించాలని ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు అవార్డులు

వినియోగదారుల సంక్షేమానికి వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. వారి సేవలను గుర్తిస్తూ, ఈ ఏడాది డిసెంబర్ లో అవార్డులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత సమావేశానికి శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాల నుంచి వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు వచ్చారని, వారందరికీ రవాణా, భోజన వసతి సదుపాయల కింద రూ.1000 చెల్లించనున్నట్టు చెప్పారు.

వినియోగదారుల రక్షణ మండలి సమావేశంలో సభ్యులు తన దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారని, వినియోగదారులకు రక్షణ కల్పించాలన్న దానిపైనే ప్రధానంగా చర్చ నిర్వహించామని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తమకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రతి జిల్లాలోనూ వినియోగదారుల రక్షణ మండలికి ఒక అధికారిని నియమించాలని, కన్జ్యూమర్ ఫోరాలు ఇచ్చిన తీర్పుల అమలు కోసం ఓ హెడ్ కానిస్టేబుల్ ను వినియోగించాలని సభ్యులు కోరినట్టు చెప్పారు.

ముఖ్యంగా జిల్లాకో ల్యాబ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమి కేటాయిస్తే, కేంద్ర ప్రభుత్వమే రూ.50 లక్షల వ్యయంతో ల్యాబ్ నిర్మిస్తుందని అన్నారు. ల్యాబ్ ల ఏర్పాటుతో సరుకుల నాణ్యతపై తక్షణమే పరీక్షలు నిర్వహించడానికి వీలుకలుగుతుందని, కార్పొరేట్ కళాశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలనే నిబంధన ఉందని, దాని అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, మీ సేవ కేంద్రాల్లో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని, సర్టిఫికెట్లు కూడా సకాలంలో అందజేయడం లేదని సభ్యులు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పుట్టగొడుగుల్లా గుర్తింపుల్లేని వాటర్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పండగ రోజుల్లో ఆర్.టి.సి యాజమాన్యం ప్రయాణికుల అదనపు ఛార్జీలు వసూలు చేస్తోందని, దీనివల్ల పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండలి సమావేశం దృష్టికి సభ్యులు తీసుకొచ్చినట్టు తెలిపారు.
 
విజయవాడ ఆర్.టి.సి బస్టాండ్ లో టాయ్ లెట్ వినియోగానికి రూ.5 వసూలు చేస్తున్నారని చెప్పగా, వెంటనే సంబంధిత మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో మాట్లాడి, రూపాయి నుంచి రూ.2 వసూలు చేయాలని కోరగా, ఇందుకు ఆయన అంగీకరించారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మధ్యాహ్న భోజనం పథకం అమలులో భాగంగా అక్షయపాత్ర సంస్థ విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేయడంలేదని తన దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై విద్యాశాఖాధికారులు స్పందిస్తూ, ఆయా విద్యా సంస్థ యాజమన్యాలకు కోడిగుడ్డుకు రూ.1 చొప్పున చెల్లిస్తున్నామని వారు చెప్పారని, చంద్రన్న విలేజ్ మాల్స్ లో ‘ప్యాక్’ ల పేరిట అధిక ధరలకు కొన్ని రకాల వస్తువులు విక్రయిస్తున్నారని సభ్యులు చెప్పగా, ఆయా వస్తువుల ధరల అదుపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు పుల్లారావు తెలిపారు.

బస్ పాస్ లు ఇస్తూ, బస్సులు నడపడం లేదన్నారు. పట్టణాల్లో జనరిక్ మందులు కొనుగోలు చేసి, ఆర్.ఎం.పిలు, మెడికల్ షాపుల యజమానులు గ్రామాల్లో సాధారణ ధరలకు విక్రయిస్తున్నారని సభ్యులు ఫిర్యాదు చేశారని, నాణ్యమైన ఆహారం అందేలా ఫుడ్ కంట్రోల్ బోర్డును పౌర సరఫరాల శాఖ క్వాలిటీ, కంట్రోల్ కిందకు తీసుకొస్తున్నామని, ఆయిల్ బంక్ లో ఇంధనం నింపుకునే సమయంలో క్రెడిట్ కార్డు వినియోగిస్తే 2 శాతం చార్జి వసూలు చేస్తున్న విషయాన్ని తన దృష్టికి తెచ్చారని అన్నారు.

మచిలీపట్నంలో విద్యుత్ కోతలు సరికాదు 

కొన్ని సంవత్సరాల నుంచి మచిలీపట్నంలో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకూ గంట పాటు విద్యుత్ కోత విధిస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు తీసుకొచ్చారు. దీనిపై ఆయన సంబంధిత ఎస్.ఇ.తో ఫోన్లో మాట్లాడారు. ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం 24 విద్యుత్ సరఫరా చేస్తోందని, ప్రభుత్వ పనితీరుకు మచ్చ కలిగేలా రోజూ గంట పాటు ఎందుకు విద్యుత్ కోత విధిస్తున్నారని ఎస్.ఇ.ని ప్రశ్నించారు. తాము విద్యుత్ కోత చేయడం లేదని, తాగునీటి కోసం మున్సిపల్ అధికారులే కరెంటు నిలుపుదల చేస్తున్నారని ఆయన మంత్రికి వివరించారు. ఇకపై కరెంట్ కోతను ప్రాంతాల వారీగా చేసుకోవాలని ఎస్.సి.ని ఆదేశించారు.

అంతకుముందు సచివాలయంలోని రెండో బ్లాక్ లో రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి సమావేశం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగింది. డాక్టర్లు మందుల పేర్లు స్పష్టంగా రాయడంలేదని, జనరిక్ మందుల పేర్లు రాయడంలేదని సభ్యులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులపై ఫిర్యాదు చేశారు.

స్టెమ్ సెల్ బ్యాంక్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారని, సెల్స్ ని నిల్వ చేయడానికి తగిన రక్షణ కేంద్రాలు లేవని అన్నారు. కొన్ని చోట్ల జీఎస్టీ నెంబర్ లేకుండా అదనంగా జీఎస్టీ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు. చీరలు, రెడీమేడ్ దుస్తులు అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. పట్టణాలలో మంచినీటి పైప్ లైన్లు 40 నుంచి 60 ఏళ్ల క్రితం వేసినవి కావడంతో మధ్యమధ్యలో లీకై మురుగు నీరు వస్తోందని చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నారని, గుర్తింపులేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారని మంత్రికి ఈ సమావేశంలో వివరించారు.  

More Telugu News