Donald Trump: తన కారును స్వయంగా కిమ్ కు చూపించిన ట్రంప్!

  • ట్రంప్ - కిమ్ లంచ్ చేసిన తర్వాత ఓ ఆశ్చర్యకరమైన సంఘటన
  • యూఎస్ అధ్యక్షుడు ఉపయోగించే కారు ది బీస్ట్ 
  • బీస్ట్ లోపలి భాగాలను కిమ్ కు చూపించి ప్రత్యేకతను తెలియజెప్పిన వైనం

యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ భేటీ కావడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పర్యటనలో మరిన్ని ఆశ్చర్యకర విషయాలు చోటుచేసుకున్నాయి. కిమ్ తన ఆరోగ్య సమస్యలను పశ్చిమదేశాలు తెలుసుకోకుండా ఉండే నిమిత్తం అత్యాధునిక మొబైల్ టాయిలెట్ ను వెంట తీసుకెళ్లిన విషయం తెలిసిందే. దక్షిణ కొరియా పత్రికలో వెలువడ్డ ఈ కథనం ఆశ్చర్యం కలిగించింది.

ఇదిలా ఉండగా, కిమ్- ట్రంప్ భేటీ అనంతరం లంచ్ చేసిన తర్వాత  మరో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. యూఎస్ అధ్యక్షుడు ఉపయోగించే కారు ది బీస్ట్ (కాడిలాక్ వన్) ఉంది. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వాహనంగా దీనికి పేరుంది. సైనిక, రసాయనిక దాడినైనా తట్టుకొనే విధంగా బీస్ట్ ను డిజైన్ చేశారు.ఈ వాహనం దరిదాపుల్లోకి కూడా ఎవరినీ రానీయరు. అటువంటిది, ఉత్తర కొరియా అధ్యక్షుడిని ట్రంప్ స్వయంగా తీసుకెళ్లి బీస్ట్ లోపల ఎలా వుంటుందో చూపించారు. ట్రంప్-కిమ్ లంచ్ అనంతరం అక్కడి పోర్టికోలో ఉన్న బీస్ట్ వద్దకు వెళ్లారు. ట్రంప్ వెంటే ఉండే ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బీస్ట్ కారు డోర్ తెరచి లోపలి భాగాలను కిమ్ కు చూపించడం గమనార్హం. యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ప్రొటోకాల్ ను పక్కనబెట్టి తానే స్వయంగా తన వాహనం వద్దకు కిమ్ ను తీసుకెళ్లి చూపించడం సర్వత్ర చర్చనీయాంశమైంది.

More Telugu News