New Delhi: రాజ్ భవన్ లో రాత్రంతా సోఫాలోనే పడుకున్న కేజ్రీవాల్... ఇంకా కరుణించని ఎల్జీ!

  • డిమాండ్లను పరిష్కరించాలంటున్న కేజ్రీవాల్
  • నిన్నటి నుంచి వేచి చూస్తున్నా అపాయింట్ మెంట్ ఇవ్వని అనిల్ బైజాల్
  • రెండో రోజుకు చేరిన కేజ్రీవాల్ నిరసన

ఢిల్లీ వాసులకు రేషన్ ను ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలన్న తన నిర్ణయానికి ఆమోదం తెలపాలని, నాలుగు నెలలుగా విధులకు హాజరుకాని ఐఏఎస్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, వీటిపై మాట్లాడేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇంటికి వెళ్లి ఆయన అపాయింట్ మెంట్ కోసం వేచిచూస్తున్న అరవింద్ కేజ్రీవాల్, రెండో రోజూ తన నిరసనను కొనసాగిస్తున్నారు.

నిన్న రాత్రి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మంత్రులు సత్యేంద్రకుమార్ జైన్, గోపాల్‌ రాయ్‌ లతో కలసి రాజ్ భవన్ కు వెళ్లిన కేజ్రీవాల్, ఎల్జీ అపాయింట్ మెంట్ లభించక పోవడంతో రాత్రంతా అక్కడి వెయిటింగ్ హాల్ లోనే కూర్చుండిపోయారు. అక్కడున్న సోఫాపై రాత్రి నిద్రపోయారు. అక్కడికే ఆహారాన్ని తెప్పించుకుని తిన్నారు. మధుమేహ వ్యాధి ఉండటంతో ఇన్సులిన్ ఇంజక్షన్ ను కూడా అక్కడే తీసుకున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ నిరసన రెండో రోజుకు చేరినప్పటికీ గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి పిలుపూ రాలేదని తెలుస్తోంది. కాగా, గవర్నర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఢిల్లీ సీఎం ఎల్జీని బెదిరిస్తున్నారని, ఎలాంటి కారణం లేకుండానే ఆయన అకస్మాత్తుగా నిరసనకు దిగారని ఆరోపించడం గమనార్హం.

More Telugu News