Sub station: హామీ మేరకు ఉద్యోగం ఇవ్వలేదని.. సబ్ స్టేషన్‌కు తాళం.. నాలుగు గ్రామాలకు కరెంట్ కట్!

  • సబ్ స్టేషన్ నిర్మాణం కోసం భూమి విరాళం
  • కుమారుడికి ఉద్యోగం ఇస్తామన్న అధికారులు
  • అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం

ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి భూమిని విరాళంగా తీసుకున్న అధికారులు.. తర్వాత ఆ హామీని విస్మరించడంతో ఆ రైతుకు చిర్రెత్తుకొచ్చింది. తన భూమిలో నిర్మించిన సబ్ స్టేషన్ వద్దకు భార్యతో సహా చేరుకున్న ఆయన దానికి తాళం వేసి ధర్నాకు దిగాడు. ఫలితంగా నాలుగు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెలంగాణలోని పెద్దపల్లి మండలం రాగినేడులో జరిగిందీ ఘటన.

గ్రామానికి చెందిన మల్లెత్తుల కొమురయ్య 2016లో సబ్ స్టేషన్ నిర్మాణానికి తన 20 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్బంగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ చదువుకున్న తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. ఉద్యోగం ఇప్పిస్తామని గ్రామ పెద్దలు కూడా ఒప్పించారు. కొమురయ్య ఇచ్చిన భూమిలో సబ్ స్టేషన్ నిర్మించి సరఫరా ప్రారంభమైనా కొమురయ్య కుమారుడికి మాత్రం ఉద్యోగం రాలేదు. దీంతో ఆయన ట్రాన్స్‌కో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది.

ఇక లాభం లేదనుకున్న కొమురయ్య సోమవారం భార్య రేణుకతో కలిసి సబ్ స్టేషన్‌కు వెళ్లి తాళం వేశాడు. అనంతరం అక్కడే టెంట్ వెసి ధర్నా చేపట్టాడు. ఆయనకు మద్దతుగా గ్రామస్థులు కూడా ధర్నాలో పాల్గొన్నారు. సబ్ స్టేషన్‌కు తాళం వేయడంతో ఆపరేటర్ విద్యుత్ సరఫరాను నిలిపివేశాడు. దీంతో నాలుగు గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది.

విషయం తెలిసిన అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించి, తాళం తీయాలని కోరినా ఆయన వినిపించుకోలేదు. సాయంత్రం వరకు ధర్నా నిర్వహించాడు. కరెంటు లేక ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుండడంతో మరో సబ్ స్టేషన్ నుంచి సరఫరాను పునరుద్ధరించారు.

More Telugu News