chanda kochhar: ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్‌కు రూ.25 కోట్ల జరిమానా?

  • వీడియోకాన్‌కు రుణ మంజూరీ ద్వారా లబ్ధి
  • రుణ మంజూరీలో క్విడ్ ప్రొ కో
  • పెనాల్టీ చెల్లించి సెటిల్ చేసుకునే అవకాశం

ఓ సంస్థకు రుణం మంజూరు చేయడం ద్వారా అనుచితంగా లబ్ధి పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచర్‌కు భారీ జరిమానా విధించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.  ఆమెను పదవి నుంచి దిగిపోవాలని సెబీ ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. అలాగే, అయాచితంగా లబ్ధిపొందిన విలువకు మూడు రెట్లు, లేదంటే గరిష్టంగా రూ.25 కోట్లు జరిమానా విధించేందుకు సెబీ రెడీ అయినట్టు సమాచారం. అయితే, ఈ కేసు న్యాయ నిర్ణేత అధికారే ఎంత జరిమానా విధించాలన్న విషయాన్ని నిర్ణయించనున్నారు.

2012లో వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ రూ.3250 కోట్లు రుణం మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో చందా కొచర్ భర్త దీపక్ కొచర్ అనుచితంగా లబ్ధి పొందారన్నది ఆరోపణ. కొచర్ కుటుంబానికి, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ మధ్య క్విడ్ ప్రొ కో జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెబీ రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టింది. షేర్ల ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని కొచర్ బహిర్గతం చేశారా? ఈ విషయంలో సెబీ నిబంధనలను అతిక్రమించారా? అన్న విషయమై దర్యాప్తు చేస్తోంది. ఆరోపణలు నిజమైతే కొచర్‌కు భారీ జరిమానా తప్పనట్టే. మరోవైపు, ఈ వివాదాన్ని చందా కొచర్.. సెబీతో సెటిల్ చేసుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. జరిమానా చెల్లించడం ద్వారా దర్యాప్తు నుంచి తప్పించుకునే అవకాశం ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

More Telugu News