sco summit: పాకిస్తాన్ అధ్యక్షుడితో చేయి కలిపిన భారత ప్రధాని... ఆహ్వానించిన చైనా

  • షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు కు హాజరైన మోదీ
  • పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ సైతం హాజరు
  • గతేడాదే ఇరు దేశాలకు ఎస్ సీవో లో అవకాశం కల్పించిన చైనా

చాలా కాలం తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన కీలక నేతల మధ్య చేతులు కలిశాయి. చైనాలో జరుగుతున్న 18వ షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులు కలిపి కాసేపు ముచ్చటించారు. ఎనిమిది సభ్య దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది.

2016లో జమ్మూ కశ్మీర్లోని యూరి ఆర్మీ క్యాంపుపై పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో అదే ఏడాది ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ దేశాల సదస్సుకు హాజరుకానని మన దేశం తేల్చి చెప్పింది. దీంతో అనివార్యంగా ఈ సదస్సును వాయిదా వేశారు. ఇన్నాళ్ల తర్వాత రెండు దేశాల మధ్య పలకరింపు చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా భారత్, పాక్ అధినేతలను ఎస్ సీవో సదస్సుకు ఆహ్వానం పలుకుతున్నట్టు  చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటన చేశారు. రెండు దేశాల హాజరుకు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఇది ఎస్ సీవో బలంగా పేర్కొన్నారు. ఎస్ సీవో లో భారత్, పాక్ లను చేర్చిన తర్వాత ఇటు మోదీ, అటు హుస్సేన్ హాజరు కావడం ఇదే మొదటి సారి. గతేడాదే భారత్, పాక్ లకు చైనా అవకాశం కల్పించింది. దేశాల మధ్య సహకారం కోసం ఏర్పాటైనది ఇది. అయితే, మోదీ, హుస్సేన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు అయితే జరగడం లేదు. 

More Telugu News