bihar: బిహార్ లో అక్రమ మద్యం నిల్వలను పట్టుకునేందుకు తెలంగాణ నుంచి శునకాలు

  • 20 శునకాలకు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ శిక్షణా కేంద్రంలో తర్ఫీదు
  • బాంబు జాడలతో పాటు మద్యం అనవాళ్లనూ గుర్తించడంలో నేర్పరితనం
  • విజయవంతం అయితే, మరిన్ని శునకాల కోసం అభ్యర్థన

బిహార్ లో సంపూర్ణ మధ్య నిషేధాన్ని అమలు చేయాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంకల్పంలో భాగంగా అక్కడి పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో వాలిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇంటెగ్రేటెడ్ ట్రెయినింగ్ అకాడమీలో 20 శునకాలకు అత్యాధునిక శిక్షణ ఇప్పించారు. ఇవి కేవలం బాంబు జాడలనే కాదు, మద్యం వాసన సైతం పసిగడతాయి. వీటి సాయంతో బిహార్ లో మద్యాన్ని ఏరిపారేయాలన్నది అక్కడి పోలీసుల ప్రయత్నం. ఈ విషయాన్ని బిహార్ సీఐడీ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ పీటీఐకి తెలిపారు.

తాము ముందుగా ఆర్మీ, పారా మిలటరీ దళాలకు చెందిన కుక్కల శిక్షణ కేంద్రాలను సంప్రదించినప్పటికీ, మద్యం వాసనను పట్టుకునే శునకాలు అక్కడ లేవని వినయ్ కుమార్ చెప్పారు. 20 పప్పీలకు 8-9 నెలల పాటు మద్యం వాసన గుర్తించడంలో తెలంగాణలో శిక్షణ ఇచ్చినట్టు, వీటి సాయంతో బిహార్ లో మద్యం అక్రమ నిల్వలను పట్టుకోనున్నట్టు ఆయన తెలిపారు. 20 శునకాలను బిహార్ లోని నాలుగు పోలీసు జోన్లు పాట్నా, ముజఫర్ పూర్, దర్భంగ, భాగల్పూర్ కు అందించనున్నట్టు చెప్పారు. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే, మరిన్ని శునకాలను అందించాలని తెలంగాణను కోరతామని వినయ్ కుమార్ తెలిపారు. 2016 ఏప్రిల్ లో సీఎం నితీష్ కుమార్ మద్య నిషేధాన్ని బిహార్ లో అమల్లోకి తెచ్చిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News