Rajasthan: ఖురాన్ పఠిస్తూ కుమార్తె గొంతు కోసిన తండ్రి.. అల్లా అనుగ్రహం కోసమేనట!

  • నాలుగేళ్ల కుమార్తె గొంతు కోసిన తండ్రి
  • పిల్లి కరిచి చంపేసినట్టు నమ్మించే యత్నం
  • పోలీసుల విచారణలో నిజం కక్కిన నిందితుడు

కుమార్తెను తీసుకుని మార్కెట్‌కు వెళ్లాడు. నువ్వంటే నాకెంతో ఇష్టమని ఊసులు చెప్పాడు. ఇష్టమైన మిఠాయిలు కొని తినిపించాడు. తండ్రి మాటలను నిజమేనని నమ్మేసిందా చిన్నారి. కానీ, తండ్రి చెబుతున్నవన్నీ అబద్ధాలని, తన ప్రాణం తీసేందుకు కుట్ర పన్నాడని తెలుసుకోలేకపోయింది. కుటుంబ సభ్యులు తేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని పైపర్ సిటీకి చెందిన నవాబ్ అలీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రంజాన్ మాసం కావడంతో దీక్ష చేపట్టాడు. గురువారం సాయంత్రం పెద్ద కుమార్తె రిజ్వానా (4)ను మార్కెట్‌కు తీసుకెళ్లి ఆమెకు ఇష్టమైన స్వీట్లు కొనిపెట్టాడు. ఆ రాత్రి భార్య, పిల్లలతో కలిసి పై అంతస్తులో నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా రిజ్వానాను తీసుకుని కిందికి వచ్చాడు. ఖురాన్‌ను పఠిస్తూ కత్తితో కుమార్తె గొంతు కోసి చంపేశాడు. అనంతరం పైకెళ్లి నిద్రపోయాడు.

తెల్లారిన తర్వాత కిందికి వచ్చిన అలీ భార్య షాక్‌కు గురైంది. రక్తపు మడుగులో పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించింది. అంతా చూస్తున్న అలీ, రిజ్వానాను పిల్లి మెడకొరికి చంపేసి ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి చిన్నారిది హత్యగా నిర్ధారించారు. అలీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు. అల్లా అనుగ్రహం కోసమే కుమార్తెను బలిచ్చినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News