Chandrababu: మోదీ, అమిత్ షాలను అంచనా వేయగల నాయకుడు చంద్రబాబు: బీజేపీ నేత మురళీధరరావు

  • చంద్రబాబు ఏ పరిణామాన్నీ తేలికగా వదిలి పెట్టరు
  • బాబు లాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు ముందుకు వస్తాయి
  • చిరంజీవిలా పవన్ విఫలమవుతారనే అంచనాలు తప్పు
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేసే పనిలో పడిందని... బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయ రంగంలోకి దిగలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. ఏ పరిణామాన్ని కూడా తేలికగా వదిలిపెట్టకుండా, తుది దాకా పోరాడే శక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందని తెలిపారు.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను అంచనా వేయగలిగే అతికొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరని అన్నారు. చంద్రబాబులాంటి బలమైన నేతను ఓడించేందుకు కొత్త పార్టీలు, వేదికలు ముందుకు వస్తాయని తెలిపారు. వివిధ రకాల సమీకరణాలు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తర్వాత చిరంజీవి విఫలమయినట్టు, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విఫలమవుతారనే అంచనాలు తప్పని... అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయని మురళీధరరావు చెప్పారు. వివిధ వర్గాలను తనకు మద్దతుగా రప్పించుకోగల సమర్థతను పవన్ ప్రదర్శించాల్సి ఉందని అన్నారు. ఎన్టీయేలో ఉన్న పార్టీలు బయటకు పోవని, కొత్త పార్టీలు కూడా వచ్చి చేరుతాయని తెలిపారు. శివసేనతో తమకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. బీజేపీని బలోపేతం చేయడంతో పాటు, మిత్రులను కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. 
Chandrababu
Pawan Kalyan
Chiranjeevi
muralidhar rao
modi
amit shah

More Telugu News