ramdev baba: మళ్లీ త్వరలోనే రానున్న బాబా రామ్ దేవ్ ‘కింభో’ మెస్సెంజర్ యాప్

  • గత  వారమే విడుదలై లోపాలు బయటపడడంతో ఉపసంహరణ
  • నిపుణులు వాటిని సరిచేసేంత వరకు విడుదల చేయబోమన్న ఆచార్య బాలకృష్ణ
  • త్వరలోనే తీసుకొచ్చే ప్రయత్నాలు

పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రమోటర్, యోగా గురువు బాబా రామ్ దేవ్ ఇటీవలే కింభో పేరుతో స్వదేశీ మెస్సెంజర్ యాప్ ను తీసుకురాగా, అందులో ఉన్న లోపాల కారణంగా దాన్ని గత వారమే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే, కొన్ని వారాల్లోనే ఈ యాప్ ను మళ్లీ తిరిగి తీసుకురానున్నట్టు పతంజలి ఆయుర్వేద్ ముఖ్య ప్రమోటర్, సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

సెక్యూరిటీ నిపుణులు, హ్యాకర్లు యాప్ లో ఉన్న అన్ని భద్రత, గోప్యత లోపాలను సరిచేసేంత వరకు కింభో యాప్ ను విడుదల చేయరాదని నిర్ణయించినట్టు బాలకృష్ణ చెప్పారు. వాస్తవానికి కింభో యాప్ గత వారమే లైవ్ లోకి వచ్చింది. ఇందులో ఉన్న సెక్యూరిటీ లోపాలపై విమర్శలు రావడంతో వెంటనే ఉపసంహరించుకున్నారు.

ప్రముఖ ఫ్రెంచ్ సెక్యూరిటీ విశ్లేషకుడు ఎలియట్ ఆల్డర్సన్ ఈ యాప్ ను సెక్యూరిటీ డిజాస్టర్ (భద్రతకు ముప్పు) గా అభివర్ణించారు. అంతేకాదు దీన్నొక జోక్ గానూ పేర్కొన్నారు. అందరు యూజర్ల మెస్సేజ్ లను తాను సులభంగా పొందగలనంటూ యాప్ లో ఉన్న లోపాలను ఎత్తిచూపించారు.

More Telugu News