Pranab Mukherjee: బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలో ఉంది!: ప్రణబ్ ముఖర్జీ

  •  సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత నిలబడి ఉంటుంది
  • ఎవరి నమ్మకాలు, ఆలోచనలు ఏవైనా జాతీయత మాత్రం ఒకటే
  • అసహనం, ఆందోళనలు మన జాతీయ భావనను దెబ్బతీస్తాయి

బహుళత్వాన్ని ఆస్వాదించే గుణం మన జీవన విధానంలో ఉందని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న తృతీయ వర్ష్ వర్గ్ కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రణబ్ మాట్లాడుతూ, జాతీయత, దేశభక్తి అన్న భావనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు. జాతి, జాతీయత అనే భావనలు ఐరోపా కంటే ముందే మన దేశంలో ఏర్పడ్డాయని, అనేక మంది విదేశీ యాత్రికులకు భారతీయత గురించి స్పష్టమైన అవగాహన ఇచ్చారని, తక్షశిల, నలంద, విక్రమ శిల వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యా వ్యాప్తికి నిదర్శనమని కొనియాడారు. బుద్ధిజం దక్షిణ మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియా వరకు విస్తరించిందని, దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చింది మౌర్యులని, అశోక చక్రవర్తి సమయంలో దేశమంతా భౌగోళికంగా ఏకఛత్రాధిపత్యం కిందకు వచ్చిందంటూ చరిత్రకు సంబంధించిన విషయాలను ఆయన ప్రస్తావించారు. 

మన దేశానికి వచ్చిన అనేక జాతులు, సంస్కృతులు మన జీవనవిధానంలో విలీనమయ్యాయని, సర్వమతాల ఏకత్వంలోనే భారతీయత నిలబడి ఉంటుందని చెప్పారు. ఎవరి నమ్మకాలు, ఆలోచనలు ఏవైనప్పటికీ జాతీయత మాత్రం ఒకటేనని చెప్పిన ప్రణబ్, అసహనం, ఆందోళన అన్నవి మన జాతీయ భావనను దెబ్బతీస్తాయని అన్నారు.

భారతదేశం ఒక భాష, ఒక మతం అని ఎప్పటికీ ఊహించలేమని, ఇంతటి వివిధత్వం ఏకతాటిపై నడవడం గొప్ప విచిత్రమని చెప్పారు. ఎన్ని వైరుద్ధ్యాలున్నా అందరిదీ భారతీయత అనే బాటేనని అన్నారు. మన కళ్ల ముందు జరుగుతున్న హింస మన మనసుల్ని కలచి వేస్తోందని, భావ వైరుద్ధ్యాల వల్ల రగిలే హింస కారణంగా కల్లోలం చెలరేగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనందమే జీవన మకరందం కావాలని, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ప్రభువులు సంతోషంగా ఉంటారన్న కౌటిల్యుని సూత్రం ఇప్పటికీ శిరోధార్యమేనని ప్రణబ్ అన్నారు.

  • Loading...

More Telugu News