kutumba rao: నిజ నిర్ధారణ కమిటీ వేస్తారట.. పవన్‌ కల్యాణ్‌ను చూసి నేర్చుకున్నట్టున్నారు!: జీవీఎల్ పై కుటుంబరావు సెటైర్

  • జీవీఎల్‌ నరసింహారావుకి సవాలు విసిరాను
  • చర్చకు రావాలని అన్నాను
  • దాన్ని స్వీకరించకుండా నిజ నిర్ధారణ కమిటీ వేస్తానన్నారు
  • జీవీఎల్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేసి మాట్లాడుతున్నట్లున్నారు

ప్రభుత్వ అధికారులతో చర్చకు రావాలని నిన్న తాను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావుకి సవాలు విసిరితే, దాన్ని స్వీకరించకుండా నిజ నిర్ధారణ కమిటీ వేస్తానని అన్నారని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను చూసి ఆయన నేర్చుకున్నట్టున్నారని ఎద్దేవా చేశారు.

కొన్ని నెలల క్రితం పవన్‌ జేఎఫ్‌సీ నివేదిక ఇచ్చాక దాన్ని పట్టించుకోకుండా పోయాడని విమర్శించారు. జీవీఎల్‌కి ప్రభుత్వ అధికారులపై నమ్మకం లేదా? అని కుటుంబరావు ప్రశ్నించారు. వారి అధికారులను కూడా వారు నమ్మరా? అని అడిగారు. మీ అధికారులను పంపండి, మా అధికారులను పంపుతాం, నిజానిజాలు తేల్చుతారని అన్నప్పటికీ జీవీఎల్‌ ఒప్పుకోకపోవడమేంటని ప్రశ్నించారు.

నగరాల్లో ఉండి యూసీలు ఇవ్వడం లేదని మాట్లాడడం కాదని, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం వెళ్లి వెనకబడిన జిల్లాలకు ఏపీ సర్కారు ఎంత ఖర్చు పెట్టిందో తెలుసుకోండని కుటుంబరావు సూచించారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి జీవీఎల్‌ మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కాగా, వైసీపీ నేతలు అగ్రిగోల్డ్‌ అంశంలో అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నారని కుటుంబరావు అన్నారు. అగ్రిగోల్డ్‌ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేసిందో స్పష్టంగా చెప్పండి చూద్దాం అని అన్నారు.

ఆర్థిక ఉగ్రవాదులు చెప్పే మాటలు అలాగే ఉంటాయని, జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయసాయిరెడ్డికి బెయిల్‌ ఇచ్చేటప్పుడు మత ఉగ్రవాదం కన్నా ఆర్థిక ఉగ్రవాదం చాలా ముప్పు అని న్యాయస్థానం కూడా పేర్కొందని కుటుంబరావు అన్నారు. ఇటువంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇలాంటి ఆరోపణలే చేస్తారని, ఎటువంటి ఆధారాలు ఉన్నా కోర్టుకి వెళ్లొచ్చుకదా అని వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ అంశంలో రాష్ట్ర సర్కారు పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అసత్యాలతో లేనిపోని విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. అగ్రిగోల్డ్‌ కేసు మొత్తం హైకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. 

More Telugu News