bjp: వచ్చే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ కొత్త ఆలోచన.. సీనియర్లను రంగంలోకి దించే యత్నం!

  • 2019 సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ
  •  ప్రతికూలతలను ఎదుర్కొనే వ్యూహరచన  
  • అగ్ర నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి అవకాశం?

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలో ఆశించిన స్థానాల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది. అలాగే, యూపీ, మహారాష్ట్రలో జరిగిన ఉపఎన్నికల్లోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. దేశంలో బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, మోదీ హవాకు బ్రేక్ పడుతోందని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శనమంటూ విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడం తెలిసిందే. దీనికితోడు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా బీజేపీపై అసంతృప్తితో ఉన్నాయి. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం, బీజేపీ తీరును శివసేన పార్టీ తూర్పారబట్టడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ప్రతికూల పరిస్థితులను అధిగమించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్న బీజేపీ కొత్త ఆలోచన చేసినట్టు తెలుస్తోంది. తమ పార్టీకి చెందిన అగ్రనేతలను మళ్లీ రంగంలోకి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 75 ఏళ్లకు పైబడిన వారిని ఎన్నికలకు, పదవులకు దూరంగా ఉంచాలని బీజేపీ అధిష్ఠానం గతంలో భావించింది. ఇప్పుడీ నిబంధనను పక్కకు పెట్టి బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, మురళీమనోహర్ జోషి లను ఎన్నికల బరిలోకి దించాలని చూస్తున్నట్టు సమాచారం.

 అద్వానీ తిరిగి పోటీ చేస్తే బాగుంటుందని మోదీ అభిప్రాయపడుతున్నారని మీడియా వర్గాల కథనం. ఈ విషయమై చర్చించేందుకే అద్వానీని మోదీ తాజాగా కలిసినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా అద్వానీతో చర్చలు జరిపినట్టు సంబంధిత వర్గాల సమాచారం. అలాగే మురళీ మనోహర్ జోషీతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.   

  • Loading...

More Telugu News