kutumbarao: జాతీయ మీడియాను కంట్రోల్‌లో పెట్టుకున్నారు: ఎన్డీఏపై కుటుంబరావు మండిపాటు

  • ఎన్డీఏ సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది
  • వ్యతిరేకిస్తే ముప్పేట దాడికి సిద్ధమవుతారా?
  • ఏపీలో ఏదైనా ఒక్క ఇన్‌స్టిట్యూట్‌ కట్టండి
  • ప్రజలు ఎన్డీఏకి ఐదేళ్లు మాత్రమే సమయం ఇచ్చారు

జాతీయ మీడియాను కంట్రోల్‌లో పెట్టుకుని, ఎన్డీఏ తమ తప్పులు బయటపడకుండా చేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్డీఏ సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. వ్యతిరేకిస్తే ముప్పేట దాడి చేయడానికి సిద్ధమవుతారా? అని ప్రశ్నించారు.

బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌ కట్టినంత సమయంలో అంటే 9 నెలల్లో ఏపీలో ఏదైనా ఒక్క ఇన్‌స్టిట్యూట్‌ కట్టండని కుటుంబరావు డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో ఏపీలో ఒక్క విద్యా సంస్థను కూడా కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు పదేళ్ల సమయం ఇచ్చారని, ఆలోపు చేయాల్సింది చేస్తామని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ప్రజలు ఎన్డీఏకి ఐదేళ్లు మాత్రమే సమయం ఇచ్చారని, ఆ తరువాత ఎవరు వస్తారో ఎవరికి తెలుసని ప్రశ్నించారు.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యలు అభ్యంతరకరమని కుటుంబరావు అన్నారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు ఎలా సాధించుకోవాలో ఏపీ సర్కారుకి తెలుసని, ఏపీకి చేసిన సాయంపై బహిరంగ చర్చకు వస్తారా? అని సవాలు విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బ తీయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు.             

More Telugu News