GALLA JAYADEV: ఇదేం నీతి స్పీకరమ్మా...? బీజేపీ వారి రాజీనామాలకు ఆమోదం... వైసీపీ వారి రాజీనామాల సంగతేంటి?: గల్లా జయదేవ్

  • బీజేపీ, వైసీపీ మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోంది
  • లోగడ అవిశ్వాస తీర్మానంపై డ్రామా, ఇప్పుడు రాజీనామాల డ్రామా
  • వారు నిజంగా కోరి ఉంటే రాజీనామాలను స్పీకర్ ఎందుకు ఆమోదించలేదు?

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు ప్రశ్నలు సంధించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభ సభ్యులుగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో గెలవడంతో వారు లోక్ సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్ వెంటనే ఆమోదించారు. అసలు వీరి రాజీనామాలను ఆమోదిస్తేనే వారు శాసనసభ బలపరీక్షలో ఓటింగ్ లో పాల్గొనడానికి వీలుంటుందన్న విషయం విదితమే.

అయితే, వీరి కంటే ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ రాజీనామాలు సమర్పించారు. కానీ, వాటిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీన్నే గల్లా జయదేవ్ ప్రశ్నిస్తూ విమర్శలు కురిపించారు. బీజేపీ వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని విమర్శించారు.

 ‘‘అవిశ్వాస తీర్మానంపై ఢిల్లీలో డ్రామా తర్వాత రాజీనామాల డ్రామా కూడా అనుకున్నట్టుగానే కొనసాగుతోంది. ఆలస్యంగా రాజీనామా చేసినా, బీఎస్ యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను స్పీకర్ ఆమోదించగా, వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమె ఎందుకు ఆమోదించలేదు... వారు నిజంగా అభ్యర్థించి ఉంటే?’’ అని జయదేవ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

More Telugu News