Teleconference: కష్టపడడాన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకోవాలి: చంద్రబాబు

  • మూడో రోజు కొనసాగుతోన్న నవ నిర్మాణ దీక్ష
  • నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో సీఎం చర్చ
  • 68 చెరువులను నీటితో నింపడం సంతృప్తినిచ్చిందన్న సీఎం
  • నిన్న 1,42,219 మందికి పింఛన్లు

నవ నిర్మాణ దీక్షలు రెండు రోజులు పూర్తయ్యాయని, మిగిలిన ఐదు రోజులు కూడా రెట్టించిన ఉత్సాహంతో జరగాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మూడో రోజు దీక్షల నిర్వహణపై విజయవాడలోని తన నివాసం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ప్రతి ఒక్కరిలో నవనిర్మాణ స్ఫూర్తి ఉండాలి. మనలో పట్టుదల మరింత పెరగాలి. కసితో అభివృద్ధి వైపు సాగాలి. గ్రామానికి వెళ్లినప్పుడు పది మందినీ కలవాలి. గ్రామస్తులను చైతన్య పరచాలి. ప్రజల భాగస్వామ్యం పెంచే బాధ్యతలను సాధికార మిత్రలు తీసుకోవాలి. ఏ అంశంపై చర్చ ఉందో ఆ వర్గం ప్రజలను అధిక సంఖ్యలో భాగస్వాములను చేయాలి" అని అన్నారు.

68 చెరువులు నీటితో నింపడం సంతృప్తినిచ్చింది..
"పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో చెరువులు నీళ్లులేక ఎండిపోయాయి. రూ.280 కోట్లు ఖర్చుచేసి హంద్రీ-నీవా ద్వారా చెరువులను నీటితో నింపాం. నిన్న 68 చెరువులను నింపడం సంతృప్తినిచ్చింది. మనం చేసిన పనులు ప్రజల కళ్లముందే ఉన్నాయి. వాటి ఫలితాలు అందరికీ కనబడుతున్నాయి. అందుకే ప్రజల్లో సంతృప్త స్థాయి 78% వచ్చింది. నవ నిర్మాణ దీక్షలతో సంతృప్తి మరింత పెరగాలి. నాలుగేళ్లలో చేసిన పనులు చెప్పండి. ప్రజల్లో మరింత సంతృప్తి పెంచండి’’ అని చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.

వారం రోజులు గ్రామాలలో ఉండడం అద్భుత అవకాశం..
"దీక్షల సందర్భంగా ప్రతి శాఖాధిపతి గ్రామాలను సందర్శించాలి. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అధ్యయనం చేయాలి. దీక్షల సందర్భంగా గ్రామాల్లో వారం రోజులు ఉంటున్నారు. ఇదొక అద్భుత అవకాశం, దీనిని సద్వినియోగం చేయాలి. గ్రామాల్లో సమస్యలు అధ్యయనం చేయండి. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించండి. మనం చరిత్ర సృష్టిస్తున్నామనేది గుర్తుంచుకోండి.

కష్టపడటాన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకోవాలి. ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులకే చేరాలి. కృష్ణా జిల్లాను ఒక నమూనాగా తీసుకోవాలి. జిల్లాలో లక్షమందిని సహజ సేద్యం వైపు మళ్లించారు. హర్యానా తరువాత రైతుల తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లా ముందంజలో ఉంది. హర్యానాను మించి కృష్ణా జిల్లా రైతాంగం తలసరి ఆదాయం పెరగాలి. ఇదే స్ఫూర్తితో మిగిలిన జిల్లాలలో కూడా రైతుల తలసరి ఆదాయం పెరగాలి.

కాలం ఎంతో విలువైనది, పోయిన కాలం మళ్లీ రాదు. కాలంతో పాటుగా మనం పరుగెత్తాలి. లక్ష్యాలను చేరుకోవాలి. సమస్యలు ఉన్నాయని ఆందోళన పడరాదు. సమస్యల పరిష్కారంలోనే మన సామర్థ్యం పెరగాలి. ప్రజల భాగస్వామ్యంతోనే అద్భుత ఫలితాలు సాధించగలం" అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజయ్ గుప్తా, రియల్ టైం గవర్నెన్స్ ఎండీ అహ్మద్ బాబు, వివిధ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

రెండవ రోజు దీక్షలో 15.59లక్షల మంది భాగస్వామ్యం..
రెండవరోజు 15,59,846 మంది నవనిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. నోడల్ బృందాలు 12,226 పనులు పరిశీలించారు. గ్రామాలు, వార్డులలో 10,866 ప్రారంభోత్సవాలు జరిపారు. 25,358 చోట్ల శంకుస్థాపనలు జరిపారు. దీక్షల సందర్భంగా 8,589 చోట్ల నిర్దేశిత అంశంపై చర్చలు జరిపారు.

రెండవరోజు 1,42,219 మందికి పింఛన్లు అందజేశారు. 2,07,115 మందికి కొత్తగా రేషన్ కార్డులు అందజేశారు. 6,752 చోట్ల సాంస్కృతిక కార్యకలాపాలు జరిగాయి. 6,046 ప్రాంతాల్లో క్రీడల పోటీలు నిర్వహించారు. 4,037 చోట్ల ఎగ్జిబిషన్లు నిర్వహించారు.

More Telugu News