public sector banks: నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంపై కేంద్రం పరిశీలన!

  • జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంకు, ఓబీసీ, సెంట్రల్ బ్యాంక్ 
  • విలీనంతో మొండి బకాయిల పెరుగుదలకు బ్రేక్ పడుతుందన్న యోచన
  • ఈ నాలుగు బ్యాంకులకు 2017-18లో రూ.21,646 కోట్ల నష్టాలు

కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకుల ఏకీకరణపై దృష్టి సారించింది. గతంలో ఎస్ బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తీవ్ర నష్టాల బాట పట్టిన నాలుగు బ్యాంకులను ఒకటి చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీన ప్రతిపాదన కేంద్రం ముందు పరిశీలనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నాలుగు బ్యాంకులను విలీనం చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే ప్రభుత్వరంగంలో ఎస్ బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకు అవతరిస్తుంది. వీటి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.16.58 లక్షల కోట్లుగా ఉంటుంది.

విలీనం ద్వారా ఈ బ్యాంకుల్లో మొండి బకాయిల పెరుగుదలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. విలీనం తర్వాత ఏర్పడే బ్యాంకు బలహీన ఆస్తులను విక్రయించడం, బ్రాంచ్ లను మూసివేయడం ద్వారా నష్టాలను తగ్గించుకునే చర్యలు తీసుకునే వీలుంటుంది. ఈ నాలుగు బ్యాంకుల ఉమ్మడి నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.21,646 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ ఐడీబీఐ బ్యాంకులో తనకున్న 51 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సరైన వ్యూహాత్మక భాగస్వామి లభిస్తే రూ.9,000-10,000 కోట్లకు విక్రయించాలని అనుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News