kiran bedi: వస్త్ర దుకాణాన్ని సీజ్ చేసిన కిరణ్ బేడీ!

  • నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనం
  • ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కిరణ్ బేడీ
  • దుకాణానికి సీలు వేయాలని అక్కడికక్కడే ఆదేశాలు

ఫైర్ బ్రాండ్ గా పేరున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తానేంటో మరోసారి చూపించారు. నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్న ఓ వస్త్ర దుకాణాన్ని దగ్గరుండి సీజ్ చేయించారు. వివరాల్లోకి వెళ్తే, పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఇటీవలే కేవీ టెక్స్ టైల్స్ పేరిట ఓ వస్త్ర దుకాణం ప్రారంభమైంది.

అయితే, ఈ దుకాణానికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో, వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఈ విషయమై కిరణ్ బేడీకి నటేశన్ నగర్ క్వార్టర్స్ సంక్షేమ సంఘం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆకస్మిక తనిఖీలు చేపట్టిన కిరణ్ బేడీ... మున్సిపాలిటీ అనుమతులు కూడా లేకుండానే భవనాన్ని నిర్మించినట్టు గుర్తించారు. వెంటనే దుకాణానికి సీలు వేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధలనకు తూట్లు పొడిచే వారిని క్షమించబోనని ఆమె హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు మున్సిపల్ కమిషనర్, ప్రజాపనుల శాఖ అధికారులు ఉన్నారు. 

More Telugu News