kumaraswamy: ఐదేళ్లూ కుమారస్వామే వుంటే ఎలా?: మల్లికార్జున ఖర్గే అభ్యంతరం

  • కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య చిచ్చు రేపుతున్న సీఎం పదవి
  • ఐదేళ్లు కుమారస్వామే సీఎంగా ఉంటే.. కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతుందన్న ఖర్గే
  • 30 నెలల తర్వాత కాంగ్రెస్ కు సీఎం పదవి ఇవ్వాలంటున్న నేతలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో... కాంగ్రెస్, జేడీఎస్ లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎక్కువ స్థానాలు వచ్చిన తమ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని... 30 నెలల తర్వాత సీఎం పదవిని కాంగ్రెస్ కు కుమారస్వామి అప్పగించాలని కొందరు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జేడీఎస్ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే కూడా ఇదే విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో భేటీ అయన ఖర్గే ఇదే విషయంపై చర్చించారు. కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం పదవి గురించి మరోసారి చర్చిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఖర్గే అన్నారట. జేడీఎస్ కు ఐదేళ్ల పాటు సీఎం పదవిని ఇవ్వడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధానమైన శాఖలన్నింటినీ జేడీఎస్ కే కేటాయించారని ఈ సందర్భంగా ఖర్గే మండిపడ్డారు. ఐదేళ్ల పాటు కుమారస్వామే పరిపాలిస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ఐదేళ్ల పాటు సీఎంగా తానే ఉంటానని ప్రమాణస్వీకారం అనంతరం కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

More Telugu News