Andhra Pradesh: మా తిరుమల వెంకన్న నీ అంతు చూస్తాడు: నరేంద్ర మోదీపై చంద్రబాబు నిప్పులు

  • రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయలేదు
  • తెలుగు వారికి అన్యాయం చేస్తే అంతు చూసే వెంకన్న
  • కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి తప్పదు
  • తప్పుడు లెక్కలు చెబుతున్న మోదీ, షా
  • నవనిర్మాణ దీక్ష సందర్భంగా చంద్రబాబు

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత నిలబడి, రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయని ప్రధాని నరేంద్ర మోదీని ఆ స్వామే చూసుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష వేదికపై నుంచి ప్రసంగించిన ఆయన, మోదీపై నిప్పులు చెరిగారు. వెంకటేశ్వర స్వామి అపార శక్తులున్న దైవమని, తెలుగు ప్రజలకు అన్యాయం చేసేవారి అంతు చూస్తాడని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే 2019 ఎన్నికల్లో బీజేపీకి పట్టనుందని విమర్శించారు.

అమరావతి నగర నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చి రూ. 2,500 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్న ఘనులు నరేంద్ర మోదీ, అమిత్ షాలని దుయ్యబట్టిన ఆయన, ఇచ్చిన డబ్బుకు ఎప్పటికప్పుడు లెక్కలు చెబుతున్నా, లెక్కలు చెప్పడం లేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీ ప్రజల పొట్ట కొడుతోందని ఆరోపించిన ఆయన, రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎంతో అభద్రతాభావంతో ఉన్నారని, వారికి అండగా తాను నిలుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించిన బీజేపీ, కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత తన ప్రభుత్వానిదేనని గుర్తు చేసిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని నదులను కలుపుతానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేంత వరకూ విశ్రమించబోనని చంద్రబాబు శపథం చేశారు. నవ్యాంధ్రను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎలా మార్చాలో తనకు తెలుసునని, ఆ శక్తిని దేవుడు తనకు ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. జూన్ 2 ఏపీ ప్రజలకు ఓ చీకటి రోజని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులకు ద్రోహం చేస్తే, బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని, ఆ పార్టీని నమ్మి మోసపోయామని అన్నారు. నవ నిర్మాణ దీక్షలు ఏడు రోజుల పాటు జరుగుతాయని, ప్రజలంతా భాగస్వాములై సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.

More Telugu News