Chandrababu: ఏపీలో మసీదుల మరమ్మతులు, ఇఫ్తార్ నిర్వహణకు రూ.5 కోట్ల విడుదల

  • రంజాన్ తోఫా సక్రమంగా అందించాలి 
  • 12 లక్షల కుటుంబాలకు చేరాలి
  • ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • అధికారులతో సమావేశంలో సీఎం చంద్రబాబు

రంజాన్ తోఫాపై సంబంధిత అధికారులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలో సమావేశం నిర్వహించారు. తోఫాను సక్రమంగా అందించాలని, 12 లక్షల కుటుంబాలకు చేరాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు.

అన్ని జిల్లాలలో మసీదుల మరమ్మతులకు, ఇఫ్తార్ నిర్వహణకు రూ.5 కోట్లు విడుదల చేశామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. "మసీదులకు రంగులు వేసి, చిన్నచిన్న మరమ్మతు పనులను పూర్తిచేయాలి. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అన్ని చోట్ల ఖురాన్ పఠన పోటీలు నిర్వహించాలి. పెద్ద మదర్సాలలో కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ముస్లిం యువతకు ఉర్దూలో శిక్షణ ఇవ్వాలి, నైపుణ్యాలు మెరుగుపరచాలి.

ఉపాధి అవకాశాలు విస్తృత పరచాలి. ముస్లిం అనాధలకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేయాలి. ప్రతినెలా రూ.1,000 పింఛన్ అందేలా చూడాలి. ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలి. ముస్లింల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారిలో వెనుకబాటును దృష్టిలో ఉంచుకునే బడ్జెట్ ను నాలుగైదు రెట్లు అధికం చేశాం.

రూ.1,100 కోట్లతో ముస్లిం మైనారిటీలకు బడ్జెట్ పెట్టడం ఒక చరిత్ర, రికార్డు. ముస్లింలకు ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశాం. మిగిలిన ఒకటో రెండో హామీలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఈ ఏడాదిలోపే నెరవేరుస్తాం" అని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో సీఎంవో కార్యదర్శి గిరిజా శంకర్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శి కే రాంగోపాల్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండి ఉషాకుమారి, నంద్యాల మైనారిటీ పెద్ద మౌలానా ముష్తాఖ్ అహ్మద్, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.       

More Telugu News