telangana formation day: రేపు స్కూల్ కి వెళ్లకుంటే రూ. 700 ఫైన్ అట!: భద్రాద్రి జిల్లాలో స్కూల్ ఆదేశం

  • జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
  • రేపటి నుంచి స్కూళ్లను ప్రారంభిస్తున్న పాఠశాలల యాజమాన్యాలు
  • ఇంత ఎండల్లో పిల్లలను ఎలా పంపించాలంటూ తల్లిదండ్రుల ఆవేదన

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే తపనతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో, జూన్ 1 నుంచే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మండుతున్న ఎండల్లో తమ చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు.

ఈ నేపథ్యంలో, పాత అకాడెమిక్ క్యాలెండర్ నే పాటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు, రేపటి నుంచే స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రైవేటు పాఠశాలలు కూడా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో, భద్రాద్రి జిల్లా బూర్గంపాడులోని ఓ ప్రైవేటు పాఠశాల ఇచ్చిన సమాచారం విమర్శలకు దారితీసింది. జూన్ 1న పిల్లలు కచ్చితంగా స్కూలుకు హాజరుకావాలని... లేకపోతే రూ. 700 ఫైన్ విధించడంతో పాటు, ప్రోగ్రెస్ రిపోర్టులో రెడ్ మార్క్ వేస్తామని సమాచారం ఇచ్చారు. దీంతో, ఇంత ఎండల్లో పిల్లలను స్కూలుకు ఎలా పంపించాలంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జూన్ 12 వరకు సెలవులను పొడిగించాలని వారు కోరుతున్నారు. 

More Telugu News