బీజేపీతో కలసి పని చేయలేమని 2014లోనే చెప్పాం: అంబటి రాంబాబు

30-05-2018 Wed 16:12
  • మోదీ, చంద్రబాబులు ఏపీని నట్టేట ముంచారు
  • చంద్రబాబుకు ప్రజలు 25 అసెంబ్లీ సీట్లు ఇస్తారు
  • జేసీలాంటి విలువలు లేని నేతలు టీడీపీలో ఉన్నారు

టీడీపీ మహానాడులో ఏ ఒక్కరూ నిజాలు మాట్లాడలేదని... ప్రజలను పక్కదోవ పట్టించేలా ప్రసంగించారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలకు కూడా నమస్కారాలతో సరిపెట్టారని అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు ఏపీని నట్టేట ముంచారని దుయ్యబట్టారు.

బీజేపీతో కలిసి పనిచేయలేమనే విషయాన్ని 2014లోనే తాము చెప్పామని తెలిపారు. చంద్రబాబుకు 25 పార్లమెంటు సీట్లను కాకుండా, 25 అసెంబ్లీ సీట్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అమెరికాలో మహానాడు కార్యక్రమాన్ని అక్కడున్న తెలుగు ప్రజలు అడ్డుకున్నారని చెప్పారు. ఏమాత్రం విలువలు లేని జేసీ దివాకరరెడ్డిలాంటి వారు టీడీపీలో ఉన్నారని మండిపడ్డారు.