sumithra mahajan: రాజీనామాలపై వైసీపీ ఎంపీలు పునరాలోచించుకోవాలి!: స్పీకర్ సుమిత్రా మహాజన్

  • ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామా
  • వైసీపీ ఎంపీలతో చర్చించిన సుమిత్రా మహాజన్
  • వచ్చేనెల 5 నుంచి 7 వరకు మరోసారి కలవాలని సూచన

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తీరుకి నిరసనగా వైసీపీ ఎంపీలు వరప్రసాద్ రావు, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు రాజీనామా లేఖలు సమర్పించిన విషయం తెలిసిందే. వారితో ఈరోజు సుమిత్రా మహాజన్ చర్చించి, వారి రాజీనామాలు భావోద్వేగపూరితంగా తీసుకున్నట్టుగా ఉన్నాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వారు రాజీనామాలు చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వాటన్నింటినీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వచ్చేనెల 5 నుంచి 7 వరకు తనను మరోసారి కలవాలని వారికి సూచించానని తెలిపారు. అలాగే, రాజీనామాలపై వైసీపీ ఎంపీలు పునరాలోచించుకోవాలని, నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తానని అన్నారు.

వైసీపీ సభ్యుల రాజీనామాలని కొందరు, కర్ణాటక ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని, ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరని సుమిత్రా మహాజన్‌ వ్యాఖ్యానించారు. కాగా, వైసీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ, స్పీకర్ ఇప్పటికీ వాటిని ఆమోదించలేదని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అంతకు ముందు తమ పార్లమెంటు సభ్యత్వాలకు బీజేపీ కర్ణాటక నేతలు యడ్యూరప్ప, బీ శ్రీరాములు రాజీనామాలు చేయగా, వాటిని సుమిత్రా మహాజన్ తక్షణమే ఆమోదించారు. మరోవైపు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుమిత్రా మహాజన్‌ ఇలా వివరణ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News