Nepal: తప్పుగా మాట్లాడాను... మన్నించండి: సుష్మా స్వరాజ్

  • 20 రోజుల క్రితం నేపాల్ లో పర్యటించిన మోదీ
  • లక్షల మంది భారతీయులను ఉద్దేశించి మాట్లాడారన్న సుష్మ
  • నేపాలీలతోనే తప్ప భారతీయులతో మాట్లాడలేదని విమర్శలు
  • పొరపాటు జరిగిందని అంగీకరించిన సుష్మా స్వరాజ్

దాదాపు 20 రోజుల క్రితం, ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లినప్పుడు తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో తప్పు జరిగిందని, అందుకు మన్నించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. నేపాల్ లోని జనక్ పూర్ లో ప్రధాని పర్యటిస్తున్న వేళ, అక్కడున్న లక్షలాదిమంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారంటూ ఆమె తన ట్విట్టర్ లో పేర్కొనడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. జనక్‌ పూర్‌ లో మోదీ నేపాలీలతో మాట్లాడారే తప్ప, భారతీయులతో కాదని నేపాల్‌ రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారు.

దీంతో, సోమవారం రాత్రి మరోసారి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఈ పొరపాటు నా వల్లే జరిగింది. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను" అని ఆమె అన్నారు. నాడు మోదీ గురించి తాను మాట్లాడిన అంశంపై ఓ చిన్న వీడియోను సైతం ఆమె పోస్టు చేశారు.  అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ నుంచి మొదలు పెట్టి, నేపాల్‌ లోని జనక్‌ పూర్ వరకూ, లక్షలాది మంది భారతీయులను కలుసుకుని మాట్లాడిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని చాలా సాధారణంగా తీసిపారేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ నేతల నుంచి విమర్శలు వచ్చాయి.

More Telugu News