Telugudesam: ఏ ఎన్నిక జరిగినా విజయం టీడీపీదే!: చంద్రబాబు

  • ప్రజలంతా టీడీపీ వెంటే
  • మహానాడును ప్రారంభించిన చంద్రబాబు
  • చేసిన పాపం కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేసింది
  • తప్పు చేస్తున్న బీజేపీకి అదే గతి

సమీప భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా తెలుగుదేశం పార్టీదే విజయమని, ప్రజలంతా మనవెంటే ఉన్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ మహానాడు సమావేశాలను తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆపై జ్యోతి వెలిగించి ప్రారంభించిన తరువాత ఆయన మాట్లాడారు. చరిత్ర ఉన్నంత వరకూ తెలుగుజాతి గుండెల్లో నిలిచివుండే వ్యక్తి ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని అన్నారు.

ఇండియాలో 70 లక్షల మంది సైన్యంలా పనిచేసే కార్యకర్తలున్న ఏకైక పార్టీ టీడీపీయేనని తెలిపారు. ఎంతో మంది కార్యకర్తల కష్టం ఫలితంగానే రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పిన చంద్రబాబు, కార్యకర్తలు లేకుంటే పార్టీయే లేదని అన్నారు. గతంలో టీడీపీ వేసిన పునాదుల వల్లే ఇప్పుడు తెలుగువారు విదేశాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఇండియాలో సంక్షేమ పథకాలకు నాంది పలికింది ఎన్టీఆర్ మాత్రమేనని, ఆ తరువాత మిగతా రాష్ట్రాలు అనుసరించాయని అన్నారు.

హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేసిందని, ఆపై రాష్ట్రానికి చేస్తానన్న సాయం చేయకుండా అన్యాయం చేసిన బీజేపీకి అదే గతి పట్టనుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు తాత్కాలికమేనని, మరో నాలుగేళ్లలో దేశంలోని టాప్-3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటామన్న నమ్మకం ఉందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కరెంటు కష్టాలు తీర్చామని, భవిష్యత్తులోనూ కరెంటు చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య మహానాడు సమావేశాలు సాగుతున్నాయి.

More Telugu News