Hyderabad: హైదరాబాద్ కు పాకిన వదంతులు... అమాయకుడిని కొట్టి చంపారు!

  • పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయని వదంతులు
  • ముగ్గురిపై రాళ్లు రువ్విన స్థానికులు
  • ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలు తిరుగుతున్నాయన్న వదంతులు హైదరాబాద్ కు పాకగా, పాతబస్తీలో హిందీ, ఉర్దూ మాట్లాడలేని ఓ అమాయకుడిని స్థానికులు కొట్టి చంపారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, చాంద్రాయణగుట్ట పరిధిలో కిడ్నాప్ గ్యాంగ్ తిరుగుతోందని నిన్న సాయంత్రం నుంచి ప్రచారం మొదలైంది. హఫీజ్ బాబా నగర్ వద్ద అర్ధరాత్రి సమయంలో, ముగ్గురు వ్యక్తులు (ఈ బృందంలో ఇద్దరు హిజ్రాలు) అనుమానాస్పదంగా తిరుగుతూ కంటబడ్డారు.

వారి నుంచి సరైన సమాధానాలు రాకపోగా, వారిని కిడ్నాపర్లు, దొంగలుగా భావిస్తూ స్థానికులు చావబాదారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరణించిన వ్యక్తి మహబూబ్ నగర్ కు చెందినవాడని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల దాడి జరగడంతో పలువురు పోలీసులకూ గాయాలు అయ్యాయి.  ఆపై కొందరిని అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ పై స్థానికులు దాడికి దిగి, పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేశారు.
Hyderabad
Police
Chandrayanagutta
Kidnap
Stone Pelting

More Telugu News