abortion: గర్భస్రావంపై ఐర్లండ్‌లో రిఫరెండం.. నేడు ఫలితాలు.. భారత మహిళ మృతితో దిగొచ్చిన ప్రభుత్వం!

  • ఐర్లండ్‌లో ఉద్యమానికి కారణమైన భారతీయ మహిళ
  • అక్కడి చట్టాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన డెంటిస్ట్
  • అబార్షన్‌పై నిషేధం ఎత్తివేయాలంటున్న ప్రజలు

అబార్షన్ చేయకపోతే ప్రాణం పోతుందని తెలిసి కూడా కఠిన చట్టాల కారణంగా వైద్యులు చేతులెత్తేశారు. ఫలితంగా ఓ భారతీయ మహిళ సవిత హలప్పనావర్ ప్రాణాలు కోల్పోయింది. అక్టోబరు, 2012లో ఐర్లండ్‌లో జరిగిందీ విషాద ఘటన. సవిత ప్రాణాలు ఇప్పుడు ఆ దేశ చట్టాల రూపురేఖలను మార్చబోతున్నాయి. మహిళ ప్రాణాలు తీసే ఇటువంటి చట్టాలను ఎత్తివేయాలంటూ ఉద్యమం మొదలుపెట్టారు. అది ‘ఇంతింతై’ చందంగా పెను ఉద్యమంగా మారి ప్రభుత్వాన్నే దిగి వచ్చేలా చేసింది. ఫలితంగా గర్భస్రావంపై రెఫరెండం నిర్వహించింది. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు రెఫరెండం ఫలితాలు వెల్లడి కానున్నాయి.

తల్లి ప్రాణానికి, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ప్రాధాన్యం ఇచ్చే ఐరిష్ ప్రభుత్వం గర్భస్రావంపై ఎన్నో ఏళ్లుగా కఠిన చట్టాలు అమలు చేస్తోంది. కేథలిక్ దేశమైన ఐర్లండ్‌లో ఈ చట్టాలను ఉల్లంఘిస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే, అదే చట్టం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు.

మూడు నెలల గర్భవతి అయిన కర్ణాటకకు చెందిన దంతవైద్యురాలు సవిత తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆమె ప్రాణాలు కాపాడాలంటే అబార్షన్ చేయడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు తేల్చేశారు. అయితే, అబార్షన్‌కు చట్టాలు అంగీకరించకపోవడంతో వైద్యులు ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా సవిత ప్రాణాలు కోల్పోయారు. సవిత ప్రాణాలు కోల్పోవడం ఎందరినో కదిలించింది. ఉద్యమంగా రూపాంతరం చెందింది. అబార్షన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఆ ఫలితమే రెఫరెండం. నిన్న జరిగిన ఓటింగ్‌లో ప్రధాని లియో వారడ్కర్ కూడా ఓటు వేశారు.

More Telugu News