bjp: ‘అచ్చే దిన్’ వస్తాయనుకుంటే ‘చచ్చే దిన్’ వచ్చాయి!: ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • నాడు మోదీని చాలా గొప్పగా ప్రజలు భావించారు
  • ‘చేతల పీఎం కాదు కూతల పీఎం’ అని నేడు అనుకుంటున్నారు
  • అప్పుడు ‘నమో నమో’ అని పూనకం వచ్చేలా యువత ఊగేవారు
  • ఇప్పుడు ఆ పేరు వింటేనే యువతకు కంపరం పుడుతోంది

 ఆకాశంలో ఉండే మోదీ పాతాళంలోకి పడిపోయాడని ఏపీ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ‘ఏబీఎన్’ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తులసిరెడ్డి మాట్లాడుతూ, ‘2014 లో నరేంద్ర మోదీని.. ఒక దేశోద్ధారకుడిగా, ఒక మెస్సయ్యగా, ఒక హీరోగా, ఒక చేతల పీఎంగా, ఒక 24 క్యారెట్ల బంగారంగా, ఒక ఆమ్ ఆద్మీ మ్యాన్ గా ప్రజలు భావించారు.

నాలుగేళ్ల తర్వాత 2018లో.. ఈయన దేశోద్ధారకుడు కాదు, వీరాభిమన్యుడు కాదు ఉత్తరకుమారుడు, మెస్సయ్య కాదు మోసయ్య, ఈయన హీరో కాదు విలన్, ఈయన చేతల పీఎం కాదు, కూతల పీఎం, ఇది 24 క్యారెట్ల బంగారం కాదు రోల్డ్ గోల్డ్, ఆయన ఆమ్ ఆద్మీ మ్యాన్ కాదు అంబానీ, ఆదానీ మ్యాన్ అని సామాన్యుడు అనుకుంటున్నాడు. 2014లో నరేంద్ర మోదీ పేరు వింటే చాలు, ‘నమో నమో’ అని పూనకం వచ్చేలా యువత ఊగేవారు. కానీ, ఈనాడు నరేంద్ర మోదీ పేరు వింటుంటే యువతకు కంపరం ఎత్తుతోంది. అచ్చే దిన్ వస్తాయనుకుంటే చచ్చే దిన్ వచ్చాయని ప్రజలు అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News