vishakapatnam: 'అండం తీసుకుంటామని చెప్పి పిండం పెట్టారు' వ్యవహారంపై పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ వివరణ

  • బయోలాజికల్ పేరెంట్స్, కేర్ టేకర్ సహా నాగలక్ష్మి మమ్మల్ని సంప్రదించింది
  • సంబంధిత అగ్రిమెంట్ పై ఇష్టపూర్వకంగానే సంతకం చేసింది
  • ఆ తర్వాతే అద్దెగర్భం ప్రవేశపెట్టాం
  • ఈ నెల 21న ఆసుపత్రికి వచ్చి ఆ గర్భం తీసేయాలని కోరింది

 నాగలక్ష్మి అనే మహిళ నుంచి అండం సేకరిస్తామని చెప్పి, ఆమెకు తెలియకుండా కడుపులో పిండాన్ని ప్రవేశపెట్టారంటూ విశాఖపట్టణంలోని పద్మశ్రీ హాస్పిటల్ పై వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. దీనిని నిరసించిన నాగలక్ష్మి, ప్రగతి శీల మహిళా సంఘం ప్రతినిధులతో కలిసి ధర్నా చేయడం విదితమే. ఈ సంఘటనపై పద్మశ్రీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ సుధా పద్మశ్రీ స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, నాగలక్ష్మి ఆరోపిస్తున్నట్టుగా తన అనుమతి లేకుండా ఆమె గర్భంలో పిండాన్ని ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు.

గత మార్చి 22న బయోలాజికల్  పేరెంట్స్, కేర్ టేకర్ కిలాడి ఉషతో కలిసి ఇందుకు సంబంధించిన లీగల్ అగ్రిమెంట్ తో నాగలక్ష్మి తమ వద్దకు వచ్చినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్ పై నాగలక్ష్మి ఇష్టపూర్వకంగా సంతకం చేసిన తర్వాతే ఆమెలో అద్దెగర్భం (సరోగసీ)ను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. ఆమెకు మందులు వేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ ఫర్ చేశామని చెప్పారు.

పద్నాలుగు రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భంలో రెండు పిండాలు పెరుగుతున్నట్టు నిర్ధారణ అయిందని చెప్పారు. అయితే, తనకు భర్త, పిల్లలూ లేరని చెప్పిన నాగలక్ష్మి, ఈ నెల 21న తన భర్తతో కలిసి ఆసుపత్రికి వచ్చిందని చెప్పారు. తనకు నీరసంగా ఉందని గర్భం తీసేయాలని కోరిందని, ఈ విషయమై బయోలాజికల్ పేరెంట్స్ తో మాట్లాడుకోవాలని, వారు అంగీకరిస్తే తీసేస్తానని చెప్పానని అన్నారు. ఇందుకు సంబంధించిన డబ్బుల వ్యవహారంలో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఎంసీఎంఆర్ నిబంధనల మేరకు తమ కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

కాగా,  విశాఖపట్టణంలోని అక్కయ్యపాలెంలో ఉన్న పద్మశ్రీ ఆసుపత్రిలో జిల్లా వైద్యఆరోగ్యాశాఖాధికారి రోణంకి రమేష్ తనిఖీలు నిర్వహించారు. బయోలాజికల్ పేరెంట్స్ తో నాగలక్ష్మి చేసుకున్న ఒప్పంద పత్రాలు, ఆసుపత్రికి ఉన్న అనుమతులను పరిశీలించారు.

More Telugu News