Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ నిరాహార దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు: జనసేన

  • ఉద్ధానం సమస్యపై ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకే దీక్ష
  • కిడ్నీ బాధితుల కష్టాలపై ప్రభుత్వ స్పందన సరిగా లేదు
  • జనసేన పోరాటం చేస్తూనే ఉంటుంది
  • పవన్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తాను బస చేస్తోన్న రిసార్ట్‌లో నిరాహార దీక్ష ప్రారంభించారు. రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల మధ్య దీక్షను కొనసాగించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు కాబట్టే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.

ఉద్ధానం కిడ్నీ బాధితులకి సర్కార్ నుంచి మెరుగైన వైద్య సేవలు అందేవరకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ ఆశించకుండా మానవతా దృక్పథంతో పవన్ కల్యాణ్ ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావాలని సంకల్పించుకున్నారని మాదాసు గంగాధరం తెలిపారు. పవన్‌ దీక్షకు సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాలు, విజయవాడ నగరంలో జనసేన శ్రేణులు సంఘీభావ దీక్ష చేస్తాయన్నారు.

ఇప్పుడున్న రాజకీయ నాయకులకి భిన్నమైన నాయకుడు పవన్‌ అని, ఆయనకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని, ప్రజలని మోసం చేయనని దమ్ముతో ప్రకటించారని చెప్పుకొచ్చారు. పవన్ ప్రజల కష్టాలను తనవిగా భావిస్తారని, కాబట్టే ఉద్ధానం సమస్యపై పవన్ కల్యాణ్ ఎంతో మధనపడుతున్నారని అన్నారు.

"ఇచ్ఛాపురం, పలాసల్లో బాధితుల్ని చూసి, వారి బాధలని పవన్ విన్నారు. గత ఏడాది హార్వర్డ్ నుంచి వైద్య నిపుణుల్ని తీసుకువచ్చినా ప్రభుత్వం సరిగా స్పందించలేదు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్లు ఏవీ మా అధ్యక్షుడు చేయడం లేదు. మొబైల్ స్క్రీనింగ్ కేంద్రాలు, కిడ్నీ సమస్యలపై పరిశోధన కేంద్రం ఏర్పాటు, డయాలసిస్ కేంద్రాలు, శుద్ధి చేసిన తాగు నీరు సరఫరా, మందులు సకాలంలో ఇవ్వడం లాంటివే అడుగుతున్నారు.

శ్రీకాకుళంలో సమస్య ఉంటే విశాఖపట్నంలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సర్కార్ చెప్పడం ఏమిటి? ఏమైనా మా సొంతానికి, మా ఇంట్లో పెట్టమని అడుగుతున్నామా? మంచి చేస్తే ఆ పేరేదో తనకే వస్తుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రికి లేదా? పవన్ కల్యాణ్ దీక్ష చేస్తే తాను ఎందుకు చేయాలా? అని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోంది. మా అధ్యక్షుడు చేపట్టిన పోరాట యాత్రకి ప్రజల్లో వస్తోన్న స్పందన చాలా బాగుంది. జనసేన అధ్యక్షుడు తమ బాధలు తీరుస్తారనే ఆశ ప్రజల్లో కనిపిస్తోంది. ఇది ఇతర పార్టీలకి కంటగింపుగా వుంది. అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు" అని మాదాసు గంగాధరం అన్నారు.

ఈ సందర్భంగా జనసేన నేత అద్దేపల్లి శ్రీధర్ మాట్లాడుతూ... "పవన్ కల్యాణ్ చేస్తోన్న యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో మా అధ్యక్షుడు చాలా సమంజసమైన డిమాండ్లే ప్రభుత్వం ముందు ఉంచారు. రాష్ట్రానికి ఒక వైద్యారోగ్య శాఖ మంత్రిని కూడా నియమించలేరా? మంత్రి ఉంటే సమస్యపై ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం ఉంటుంది.

ఎప్పటికప్పుడు వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయాలని, ప్రతి డయాలసిస్ కేంద్రంలో రీనల్ పారా మెడికల్ సిబ్బంది ఉండాలని, ఉద్ధానం ప్రాంతంలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని, అక్కడే పరిశోధన కేంద్రం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కి సంఘీభావంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మా పార్టీ శ్రేణులు దీక్షలు చేపడతాయి. పవన్ కల్యాణ్ ఇప్పటికే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారుల్ని దత్తత తీసుకున్నారు.

ఈ విధంగా ఒక్క ఎమ్మెల్యే అయినా చేశారా? పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని చేశామని మంత్రులు, అధికారులూ చెబుతున్నా..  క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు తగ్గట్టు అవి లేవు" అని అన్నారు.

More Telugu News