bjp: కేంద్ర సహకారం వల్లే ఏపీలో అభివృద్ధి వేగంగా సాగుతోంది: బీజేపీ ఎంపీ హరిబాబు

  • విభజన చట్టంలోని అంశాల్లో ఎనభై ఐదుశాతం వాస్తవ రూపం దాల్చాయి
  • ప్రధాని మోదీని నిందించేందుకే ధర్మపోరాట దీక్ష
  • ‘కాంగ్రెస్’ ను వ్యతిరేకిస్తూ పుట్టిన టీడీపీ నేడు అదే పార్టీతో చేరింది

కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఏపీలో అభివృద్ధి వేగంగా సాగుతోందని విశాఖపట్టణం బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. విశాఖలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదాకు సమానంగా ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రూ.43 వేల కోట్ల నిధులను ఐదేళ్లలో ఇస్తామని ముందుకు వచ్చిందని గుర్తుచేశారు.

రాష్ట్రానికి కేటాయించిన మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు దీనికి అదనమని చెప్పారు. విభజన చట్టంలో పొందుపర్చిన అంశాల్లో ఎనభై ఐదుశాతం వాస్తవ రూపం దాల్చాయని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును నిరసిస్తూ చంద్రబాబునాయుడు తలపెట్టిన ధర్మపోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని నిందించేందుకు ధర్మపోరాట దీక్ష, సాధికారమిత్ర, మహానాడు పేరిట సభలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పుట్టిన టీడీపీ నేడు అదే పార్టీతో చెట్టాపట్టాలు వేసుకోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని విమర్శించారు.

More Telugu News