Jana Sena: రేపు కూడా పవన్‌ కల్యాణ్‌ 'జన పోరాట యాత్ర'కు విరామం!

  • పవన్‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బందికి గాయాలు
  • ఈరోజు జరగని యాత్ర
  • ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న జనసేన
  • ఎల్లుండి నుంచి యాత్ర మళ్లీ కొనసాగుతుందని ప్రకటన

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేస్తోన్న 'జన పోరాట యాత్ర'కు వరుసగా రెండో రోజు కూడా బ్రేక్‌ పడింది. ఈ నెల 20 నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో మొదలైన పవన్‌ కల్యాణ్‌ యాత్ర నిన్న అదే జిల్లాలోని టెక్కలి వరకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 రోజుల పాటు కొనసాగాల్సి ఉంది. అయితే, పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం కనీస పోలీస్ భద్రత కల్పించడం లేదని, దీంతో సొంత భద్రతా సిబ్బందితోనే ఆయన తన పర్యటన కొనసాగిస్తున్నారని తెలిపిన జనసేన.. ఈ పర్యటనలో భద్రతా సిబ్బందిలో 11 మంది గాయపడ్డారని పేర్కొంది.

కొత్త సిబ్బంది శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉందని అందుకే ఈరోజు జన పోరాట యాత్ర జరగదని నిన్న ప్రకటించింది. తాజాగా ఈ రోజు కూడా ఓ ప్రకటన విడుదల చేసి... 'పవన్‌ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది గాయాల నుండి పూర్తిగా కోలుకోనందున 25.05.2018 (శుక్ర‌వారం) నాడు కూడా ఆయ‌న కార్య‌క్ర‌మాలు ర‌ద్ద‌య్యాయి. 26.05.2018( శ‌నివారం) నుంచి పోరాట యాత్ర కొన‌సాగుతుంది' అని పేర్కొంది.               

More Telugu News