stalin: తమిళనాడు అసెంబ్లీ వద్ద స్టాలిన్ అరెస్ట్.. రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపు

  • తూత్తుకుడి కాల్పులకు నిరసనగా అసెంబ్లీ వద్ద డీఎంకే మెరుపు ధర్నా
  • భారీ ఎత్తున తరలి వచ్చిన డీఎంకే శ్రేణులు
  • ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్

చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ వద్ద హైడ్రామా నడిచింది. తూత్తుకుడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారపక్షంపై డీఎంకే సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఈరోజు అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు దిగాయి. తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంది. దీంతో, స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, అక్కడ పోలీసులకు-డీఎంకే శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, అమాయకుల ప్రాణాలను తీసిన వారిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోందని విమర్శించారు. కనీసం ఘటనా స్థలానికి వెళ్లి, బాధితులతో మాట్లాడాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, డీజీపీ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, రేపు తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది. 

More Telugu News